రామ్‌పాల్ బాబా అరెస్ట్

 

హర్యానాలోని హిస్సార్‌లో వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మంగళవారం నుంచి పోలీసులు రామ్ పాల్ ఆశ్రమంలో ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్నవారు అడ్డుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఆరుగురు శిష్యులు మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి రామ్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌పాల్‌కు న్యాయస్థానం పలుమార్లు సమన్లు పంపినా స్పందన లేకపోవడంతో ఆయన్ని అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. 2006లో రామ్ పాల్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఇప్పటి వరకు 63 వారంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు దేనికీ రామ్ పాల్ స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల మీద రామ్‌పాల్ శిష్యులుగా చెప్పుకుంటున్నవారు పలుమార్లు దాడులు చేశారు. మంగళవారం నాడు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. రామ్ పాల్ మీద పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి కేంద్ర బలగాల సాయంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.