చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
posted on Sep 10, 2023 8:15PM
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హై ప్రొఫైల్ ఉన్న నేత కావడంతో ఆయన్ను జిల్లా జైలులో ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే పోలీసులు విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకూ రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. ఆయన్ను తరలించేందుకు వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక రాష్ట్రమంతా 144 సెక్షన్ విధించారు.
సభలూ సమావేశాలపై నిషేధం విధించారు. ఏసీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసాయి. మధ్యలో మూడు సార్లు విచారణకు బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అర్ధగంట విచారణతో ముగించారు. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగగా తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. కాగా, ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో కొన్ని కీలక అంశాలు హైలెట్ అయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. మొత్తం మీద ఈ కేసు విచారణ సందర్భంగా ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. ఒకవైపు కోర్టులో వాదనలు సాగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలను తెలిపారు. రెండో రోజు కూడా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిర్బంధం కొనసాగింది. పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు కూడా సాగాయి.
కాగా, ఆదివారం సాయంత్రం తీర్పు రిజర్వ్ అనంతరం.. న్యాయమూర్తి తీర్పు ప్రకటన సందర్భంగా ఏసీబీ కోర్టు బయట ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చంద్రబాబుకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేసుండగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలించారు. తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు, పారా మిలిటరీ బలగాల భారీగా మోహరించాయి. కోర్టు నుంచి 500 మీటర్ల మేర పోలీసులు, భద్రత సిబ్బంది మినహా ఇతరులకు అనుమతి నిరాకరిస్తూ ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్ కూడా పోలీసులు సిద్ధం చేశారు.
న్యాయమూర్తి తీర్పును బట్టి, పోలీసులు తమ కార్యాచరణను అమలు చేసే విధంగా అన్ని సిద్ధం చేసుకున్నారు. కోర్టు సమీపంలోకి మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు పోలీసులు. అటు విజయవాడ నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ నుండి రాజమండ్రి వరకూ కూడా పోలీసులు పక్కా ఏర్పాట్లతో పోలీసులు రూట్ క్లియర్ చేశారు. కోర్టు రిమాండ్ తిరస్కరిస్తే చంద్రబాబు కోర్టు నుండి టీడీపీ ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉండగా.. అక్కడ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొత్తం మీద సుమారు నాలుగు గంటల పాటు చంద్రబాబు అరెస్ట్ పై న్యాయమూర్తి వెలువరించే తీర్పు కోసం అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎదురు చూశారు. మొత్తంపై చంద్రబాబు నాయుడుకి ఏపీబీ కోర్టు రిమాండ్ కు ఆదేశించడంతో.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.