బెంగాల్ బరిలో శివసేన! హిందూ ఓట్లనే చీల్చడమే టార్గెట్టా?
posted on Jan 5, 2021 2:41PM
దేశ వ్యాప్తంగా రాజకీయ కాక పుట్టిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు శివసేన ప్రకటించింది. హుగ్లీ, కోల్‌కతా, నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ, మిడ్నాపూర్, డుండుం, బర్రాక్‌పూర్, బంకుర, విష్ణుపూర్, ఝార్గావ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో శివసేన పోటీ చేయనుంది. దాదాపు 100 సీట్లలో పోటీ చేయాలని శివసేన అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని వారాల్లోనే క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను తెలుసుకోడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కోల్‌కతాలో పర్యటించనున్నారు. సీఎం ఉద్ధవ్ పర్యటన కంటే ముందు ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ దేశాయ్ బెంగాల్‌లో పర్యటించనున్నారు. కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు.
2019 ఎన్నికల్లోనూ బెంగాల్ లో శివసేన బరిలోకి దిగింది. అయితే ఆ సమయంలో శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మహారాష్ట్రలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన బెంగాల్ లో కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే బీజేపీని దెబ్బ కొట్టేందుకే బెంగాల్ ఎన్నికల్లో శివసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. హిందుత్వ పార్టీగా చెప్పుకునే శివసేన పోటీ చేస్తే.. బెంగాల్ లో హిందూ కార్డునే నమ్ముకున్న కమలం ఓట్లకే గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు బెంగాల్ లో ఎంఐఎం కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఎంఐఎంతో మైనార్టీ ఓట్లు చీలి బీజేపీకి లబ్ది కలిగే అవకాశం ఉంది. దీనికి కౌంటర్ గానే బీజేపీ టార్గెట్ గా శివసేన ఎక్కువ అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందనే చర్చ బెంగాల్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.