ఏపీ ప్రభుత్వం నన్ను వేధిస్తోంది: ఐపీఎస్ అసోసియేషన్‌కు ఏబీ లేఖ
posted on Jan 5, 2021 2:29PM
తప్పుడు కేసులతో తనను అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉందని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఐపీఎస్ అధికారుల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశాడు. ఈ లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఏబీ ఆరోపించారు. త్వరలోనే క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి.. మళ్లీ సస్పెన్షన్ ఆర్డర్ విధించాలని కుట్ర పన్నుతోందంటూ ఆయన ఆరోపించారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. నెలల తరబడి తనకు పోస్టింగ్ జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ప్రాజెక్టులో తాను అవినీతిని చేశానని విచారణ జరిపారన్నారు.
తన సస్పెన్షన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఐపీఎస్ అధికారుల సంఘం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు . ఐపీఎస్ అధికారుల నుండి ఎలాంటి ఫేవర్ అడగడం లేదన్నారు. అయితే ఐపీఎస్ ల సంఘం స్పందించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. జైల్లో పెట్టి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అనుమానం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని వెంకటేశ్వరరావు ఆ లేఖలో వివరించారు.
గత టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు విజయవాడ కమిషనర్‌గా ఇంటెలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది.ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. భద్రతా పరికరాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. సస్పెన్షన్‌పై ఏబీ క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. అయితే ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ సర్కార్. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు స్టే ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ గత నవంబర్ లో తీర్పు ఇచ్చింది.