షర్మిల ఎఫెక్ట్.. కాంగ్రెస్ లో కుదుపు!

తెలంగాణ కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నంత సేపు పట్టలేదు  వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల రూపంలో తుపాను రేగడానికి.  కర్నాటకలో కాంగ్రెస్ అద్భుత విజయం ఆ పార్టీ తెలంగాణ శాఖలో ఉత్తేజాన్ని ఎంతగా నింపిందో.. అయోమయాన్ని, గాభరాను కూడా అంతే స్థాయిలో నింపింది. కర్నాటక స్ఫూర్తితో విభేదాలు విస్మరించి ఐక్యంగా పని చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సమాయత్తమౌతున్న వేళ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను రంగంలోకి దింపి పార్టీలో ప్రకంపనలకు స్వయంగా కాంగ్రెస్ అధిష్ఠానమే కారణమైంది.

తెలంగాణ కాంగ్రెస్ గత ఎనిమిదేళ్లుగా ఎదుర్కొన్న ఆటుపోట్లన్నీ తట్టుకుని బలం పుంజుకుంటున్న వేళ.. కాయకల్ప చికిత్స పేరిట కాంగ్రెస్ హై కమాండ్ అవసరం లేని చికిత్సకు ఉపక్రమించిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఆయన పట్ల పార్టీలోని సీనియర్లు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినా  పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలోనూ.. పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని క్యాడర్ లో కల్పించడంలోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.

రేవంత్ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ పరాజయాన్ని ఆయన ఖాతాలో వేసి నైతికంగా బలహీన పరుద్దామని భావించిన సీనియర్ల ఎత్తుగడలు, వ్యూహాలూ ఫలించ లేదు. ఆ సమయంలో పార్టీ హై కమాండ్ రేవంత్ కు మద్దతుగా  గట్టిగా  నిలబడింది. స్వయంగా పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించడంతో రేవంత్ కు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లు పన్నిన వ్యూహాలు పని చేయలేదు.

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మార్పు ద్వారా సీనియర్ల అసంతృప్తిని కొంత చల్లార్చిన కాంగ్రెస్ హై కమాండ్ ఆ తరువాత సీనియర్లను దారిలోకి తెచ్చింది. రేవంత్ నాయకత్వంలో ఐక్యంగా పని చేయక తప్పదని ఖరాఖండీగా చెప్పి ఒప్పించింది.  పార్టీలో అసంతృప్తి వాదిగా పేరుపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ విజయమే లక్ష్యం అని ప్రకటించి.. తనలో ఎటువంటి అసంతృప్తీ లేదనీ, రాష్ట్ర పార్టీ మొత్తం ఐక్యంగా ఉందనీ చెప్పడమే ఇందుకు తార్కానం. సరే ఇదంతా అలా ఉంటే.. డీకే శివకుమార్ ప్రవేశంతో సీనియర్లలో మళ్లీ రేవంత్ కు వ్యతిరేకంగా గళం సవరించుకునే అవకాశం లభించిందన్నది పరిశీలకుల వాదన. అయితే గతంలోలా సీనియర్లు, జూనియర్లు అన్నట్లుగా కాకుండా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిల ను  ఆహ్వానించి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తిరుగుండదన్న కోణంలో  రేవంత్ వ్యతిరేకులు పావులు కదిపారు.

ఇందుకు డీకే శివకుమార్ కు వైఎస్ తో ఉన్న అనుబంధం కూడా దోహదపడింది. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో కాంగ్రెస్ విజయం తరువాత స్వల్ప వ్యవధిలో షర్మిల రెండు సార్లు బెంగళూరు వెళ్లి మరీ డీకే శివకుమార్ తో బేటీ అయ్యారు. ఈ భేటీల వెనుక రాజకీయం లేదని ఇరువురూ చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. ఆ భేటీల నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. అదలా ఉంచితే.. షర్మిల కాంగ్రెస్ ప్రవేశాన్ని వేగిరం చేయడానికి దివంగత వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ కూడా రంగంలోకి దిగారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో కేవీసీ షర్మిలను కాంగ్రెస్ లో  చేరేలా ఒప్పించగలిగారు. అలా ఇలా కాదు ఏకంగా షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా. ఇందుకు ఆమె విధించిన ఏకైక షరతు తనకు పాలేరు టికెట్ ఇవ్వాలని, అందుకు కాంగ్రెస్ కూడా సుముఖత వ్యక్తం చేసిందనీ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో రాజకీయాలు చేసుకోవాలంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై నోరు మెదపడం లేదు. అంతకు ముందు షర్మిల డీకేతో భేటీ అయిన సందర్భంలో మాత్రం తాను టీపీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకూ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలు పెట్టనీయను అని చెప్పారు. అయితే ఇప్పుడు అంటే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం దాదాపు ఖాయమని తేలిపోయింది. ఇందుకు ఆమె కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీటే తార్కానం.  దీంతో ఇప్పటి వరకూ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? లేదా అన్న చర్చకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు షర్మిల  పార్టీ కాంగ్రెస్ లో వినీలం అయిపోతే రేవంత్ పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. మొత్తంగా రేవంత్ కు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ శ్రేణులు వదిలిన బ్రహ్మాస్త్రం షర్మిల అంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ సీనియర్లు గట్టిగా చెబుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ ల కంటే గట్టిగా, తీవ్రంగా కేసీఆర్ సర్కార్ పై షర్మిల విమర్శలు గుప్పించిన విషయాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో షర్మిల కాంగ్రెస్ ప్రవేశంతో రేవంత్ దూరమైతే పార్టీకి మరింత నష్టం తథ్యమని రేవంత్ వర్గీయులు అంటున్నారు. రెండూ నిజాలే అయిన నేపథ్యంలో ఈ సమస్యను కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ లో మరో సారి బయటపడిన విభేదాలు ఆ పార్టీకి ఉన్న సానుకూల వాతావరణాన్ని పాడు చేస్తున్నాయన్నది మాత్రం వాస్తవం.