శంకర్‌రావు అరెస్ట్ కి రంగంలోకి దిగిన పోలీసులు
posted on Oct 14, 2012 1:31PM

మాజీ మంత్రి శంకర్‌రావును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సర్వసన్నాహాలతో ఆయన నివాసానికి వచ్చారు. అయితే అంతకుముందే శంకర్‌రావు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. పోలీసులు ఆయన నివాసంలో అణువణువూ తనిఖీ చేసి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. రంగారెడ్డి జిల్లా అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఖానాజీగూడలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదంలో శంకర్‌రావు, ఆయన సోదరుడితోపాటు పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు కాకుండా శంకర్‌రావు తెచ్చుకున్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతోఅల్వాల్ ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు శంకర్‌రావును అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి వచ్చి వెతికినా కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదని, తమకు చెప్పలేదని శంకర్‌రావు భార్య పోలీసులకు చెప్పారు.