టీకా కొరతకు అసలు కారణం చెప్పిన సీరమ్!
posted on May 22, 2021 4:07PM
దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ తో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రస్తతం దేశంలోని 80 శాతం ప్రాంతంలో లాక్ డౌన్ అమలవుతోంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ తో పాటు వ్యాక్సినేషన్ కీలకమని వైద్య సంస్థలు చెబుతున్నారు. కొవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న పలు దేశాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇందుకు దోహదం చేసింది. కొవిడ్ ను కంట్రోల్ చేయాలంటే ఇండియాలోనీ టీకాల పంపిణి యుద్ధ ప్రాతిపదకను నిర్వహించాలని వైద్య నిపుణులు సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర సర్కార్ కుడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అది ముందుకు సాగడం లేదు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై నాలుగు నాలుగు పూర్తైనా.. ఇప్పటివరకు దేశ జనాభాలో మూడు శాతం మందికి కూడా పూర్తి వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. దేశంలో ఇప్పటివరకు 16 కోట్ల మందికి ఫస్ట్ డోస్ట్ వేయగా.. కేవలం నాలుగు కోట్ల మందికి మాత్రమే రెండో డోసు కంప్లీట్ అయింది. వ్యాక్సిన్ లేకపోవడంతో చాలా రాష్ట్రాలు టీకాల పంపిణి నిలిపివేశాయి.
కొవిడ్ వ్యాక్సినేషన్ స్లోగా జరగడానికి కేంద్ర సర్కార్ విధానాలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.తాజాగా కొవిషీల్డ్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అదే చెప్పింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాధవ్ అన్నారు. దేశంలోని టీకాల నిల్వను పట్టించుకోలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ విధానాలనూ విస్మరించిందని విమర్శించారు. హీల్ హెల్త్ అనే సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేందుకు లక్ష్యం పెట్టుకున్నారని, దానికి 60 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని చెప్పారు. దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేకపోయినా 45 ఏళ్లు నిండిన వారందరికీ, ఆ వెంటనే 18 ఏళ్లు నిండిన వారికీ కేంద్రం వ్యాక్సినేషన్ ను మొదలుపెట్టిందన్నారు.
డబ్ల్యూహెచ్ వో సూచించిన విధానాలను పాటించి ఉంటే సమస్య ఇంత జటిలమయ్యేది కాదన్నారు సురేశ్ జాధవ్. అదే ఇప్పుడు మనందరం నేర్చుకున్న పెద్ద గుణపాఠమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం పాటించాలని, దానికి అనుగణంగా టీకా ప్రాధాన్యతలను నిర్ణయించాలని జాదవ్ అన్నారు. తాము టీకాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోకుండానే ప్రభుత్వం 45 సంవత్సరాల వయస్సు పైబడినవారికి టీకాలు ఇవ్వడం ప్రారంభించిందని, ఆ తరువాత 18 ఏళ్లు పైబడినవారికి టీకాలు వేస్తామంటూ ప్రచారం సాగించిందన్నారు. భారీ సంఖ్యలో టీకాలు అందుబాటులో లేవని తెలిసినప్పటికీ ప్రభుత్వం టీకాలపై ప్రచారం ప్రారంభించిందన్నారు. టీకా తీసుకున్నవారు కూడా కరోనా ప్రోటోకాల్ పాటించాలని, లేని పక్షంలో కరోనా బారిన పడే అవకాశాలున్నాయన్నారు.
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు సూచనలు చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. 44 ఏళ్లలోపు వారి కోసం ఇంతకు ముందు పంపిన వ్యాక్సిన్లను వారికే వాడాలని కేజ్రీ అన్నారు. ఆ డోసుల్లో ఏమైనా మిగిలితే... సాయంత్రం సమయంలో వాటిని ఇతరులకు వినియోగించాలని చెప్పారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ వ్యాక్సిన్ ను దేశంలోని అన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి చేయాలని కేజ్రీ సూచించారు. 24 గంటల్లో దీనికి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విదేశీ వ్యాక్సిన్ తయారీదారులకు కూడా 24 గంటల్లో అనుమతులు ఇవ్వాలని సూచించారు. విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో కేంద్రం తక్షణమే మాట్లాడాలని... వారి నుంచి వ్యాక్సిన్ ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు, యూటీలు కొట్టుకుంటున్నాయని... దీనికి కేంద్రం ముగింపు పలకాలని కేజ్రీ కోరారు. కొన్ని దేశాలు వారికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్లను సమకూర్చుకున్నాయని... వారి దగ్గరున్న మిగులు వ్యాక్సిన్లను మనకు పంపించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని చెప్పారు.