ఫాంహౌజ్ వీడి ప్ర‌జ‌ల్లోకి ? కేసీఆర్ కు భయం పట్టుకుందా?  

కేసీఆర్.. ఫాంహౌజ్ ముఖ్యమంత్రి. ఇది కొంత కాలంగా విపక్షాల మాట. విపక్షాలే కాదు జనంలోనూ ఇదే మాట వినిపించింది. రెండో సారి అధికారంలోకి వచ్చాకా జనంలోకి ఎక్కువగా రాలేదు కేసీఆర్. ఎక్కువ సమయం ఫాంహౌజ్ లోనే ఉంటున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నారో.. ఫాంహౌజ్ లో ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి. మంత్రులకు కూడా ఆయన అపాయింట్ మెంట్ దొరకడం లేదనే విమర్శలు. అందుకే జనం కూడా కేసీఆర్ ఎక్కడంటే.. ఫాంహౌజ్ అని చెప్పేలా పరిస్థితి మారిపోయింది.

సీన్ కట్ చేస్తే.. కొన్ని రోజులుగా మ‌ళ్లీ వార్త‌ల్లో కేసీఆర్ పేరు మారుమోగిపోతోంది. ముఖ్య‌మంత్రి క‌మ్ ఆరోగ్య‌శాఖ మంత్రిగా నిత్యం క‌రోనాపై అధికారుల‌తో రివ్యూలు నిర్వ‌హిస్తున్నారు. లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాలంటూ డీజీపీని ఆదేశించారు. గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శించి, రోగుల్లో ధైర్యం నింపారు. అంత‌లోనే వ‌రంగ‌ల్‌లో సీఎం కేసీఆర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ఎమ్‌జీఎమ్ హాస్పిట‌ల్ సంద‌ర్శించి రోగుల‌ను ప‌రామర్శించారు. కేసీఆర్ త‌న రెండో ప్రాణ‌మంటూ ఆసుప‌త్రిలో ఓ వృద్ధుడు పొగుడుతున్న వీడియో వైర‌ల్ అయింది. ఇలా అబ్బో.. బొచ్చెడు న్యూస్‌. కొన్ని రోజులుగా ఏ టీవీ ఛానెల్ చూసినా కేసీఆరే క‌నిపిస్తున్నాడు. 

ఏంద‌బ్బా? ఈ విడ్డూరం. ఏళ్ల త‌ర‌బ‌డి.. ప్ర‌గ‌తి భ‌వ‌న్, ఫాంహౌజ్‌ వీడి అస‌లు బ‌య‌ట‌కే రానీ కేసీఆర్ స‌డెన్‌గా ఈ తిరుగుడేంద‌బ్బా? మంత్రులు, ఎమ్మెల్యేల‌కే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని ముఖ్య‌మంత్రి.. ఇలా కొవిడ్ పేషెంట్స్ ద‌గ్గ‌రికి రావ‌డం ఏంట‌బ్బా? అది కూడా క‌రోనా కాలంలో. మామూలోళ్లం మ‌న‌మే అన్నీ వ‌దులుకొని ఇంట్లో ఉంటుంటే.. మ‌న ముఖ్య‌మంత్రేమో ఎప్పుడూ లేనిది.. ఇప్పుడే ఫాంహౌజ్ వీడి జ‌నాల్లోకి వ‌స్తున్నారు. అది కూడా.. డాక్ట‌ర్లే వెళ్ల‌డానికి భ‌య‌ప‌డే కొవిడ్ స్పెష‌ల్ వార్డుల్లో క‌లియ తిరుగుతున్నారు. అదికూడా పీపీఈ కిట్ లేకుండా, చేతుల‌కు గ్లౌజులు వేసుకోకుండా. అందులోనూ మ‌రీ రోగుల ముఖంలో ముఖం పెట్టి మ‌రీ.. వారితో మాట్లాడుతుండ‌టం మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌రం. 

కేవ‌లం క‌రోనా రివ్యూలు, ఆసుప‌త్రి సంద‌ర్శ‌న‌లే కాదు.. రాజ‌కీయాల్లో, పాల‌న‌లోనూ కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్య‌మూ ప్ర‌ద‌ర్శించారు. ఇన్నాళ్లూ మూల‌న కూర్చోబెట్టిన మేన‌ల్లుడిని తిరిగి ఒళ్లో కూర్చోబెట్టుకుంటున్నారు. మంత్రి హ‌రీష్‌రావును మ‌ళ్లీ లైమ్‌లైట్ లోకి తీసుకొచ్చి.. పార్టీ ప‌రంగా, ప్ర‌భుత్వ ప‌రంగా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు. ఈట‌ల‌ను క‌ట్ట‌డి చేసేలా.. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను ట్ర‌బుల్ షూట‌ర్‌ హ‌రీశ్‌రావుకే అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. అటు.. పాల‌న‌లోనూ ఆయ‌న ప్రాధాన్యత పెంచేశారు. ఇన్నాళ్లూ ఆర్థిక మంత్రిగా కేవ‌లం అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌సంగానికే ప‌రిమిత‌మైన హ‌రీష్‌రావును.. త‌న‌తో పాటు ఆరోగ్య‌శాఖ రివ్యూల‌కు, క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు ముందుంచుతున్నారు. త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర ఉన్న వైద్య‌,ఆరోగ్య శాఖ బాధ్య‌త‌లు హ‌రీశ్‌రావుకు అప్ప‌గిస్తార‌ని అంటున్నారు. 
 
ఇటు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాల‌నా వ్య‌వ‌హారాల‌పైనా ఫోక‌స్ పెంచారు కేసీఆర్‌. ఎన్నాళ్లుగానో ఖాళీగా ఉన్న టీఎస్‌పీఎస్‌సీకి క‌మిటీని ప్ర‌క‌టించారు. సిన్సియ‌ర్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీస‌ర్ అయిన ఐఏఎస్ జ‌నార్థ‌న్‌రెడ్డిని టీఎస్పీఎస్సీకి ఛైర్మ‌న్‌ను చేసి శ‌భాష్ అనిపించుకున్నారు. గ‌తంలో ఇదే జ‌నార్థ‌న్‌రెడ్డి హెచ్ఎమ్‌డీఏ హెడ్‌గా ఉన్న‌ప్పుడు ఓ ల్యాండ్ డీల్‌లో స‌హ‌క‌రించ‌లేద‌నే కార‌ణంతో ఆయ‌న్ను ఉన్న‌ప‌ళంగా ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించడం అప్ప‌ట్లో వివాదాస్ప‌ద‌మైంది. అప్పుడు జ‌నార్థ‌ర్‌రెడ్డిని ఆ విధంగా అవ‌మానించినందుకు ప్ర‌యాచ్చిత్తంగానో ఏమో గానీ.. ఇప్పుడు ఆయ‌న‌కు స‌ముచిత‌మైన రాజ్యాంగ‌హోదా ఉండే పీఠంపై కూర్చోబెట్టి ఈక్వేష‌న్ బ్యాలెన్స్ చేశార‌ని అంటున్నారు. మిగ‌తా క‌మిటీ స‌భ్యుల‌ు స‌మ‌ర్థులే. అందుకే విప‌క్షాల నుంచి సైతం ఒక్క విమ‌ర్శ కూడా రాలేదు. త్వ‌ర‌లో భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాలు ఉంటాయంటూ ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డం.. తాజాగా స‌మ‌ర్థ‌వంతుల‌తో టీఎస్పీఎస్సీ క‌మిటీ నింప‌డం.. కేసీఆర్ మార్క్ ప‌నితీరుకు నిద‌ర్శ‌నం.  చాలా కాలంగా పెండింగులో ఉన్న యూనివర్శిటీలకు వీసీలను నియమించారు. వీసీల నియామకంలోనూ ఈసారి పారదర్శకత కనిపించిందని చెబుతున్నారు. 
 
కేసీఆర్‌లో స‌డెన్‌గా వచ్చిన మార్పుతో విశ్లేష‌కుల‌ు సైతం షాకవుతున్నారు. సీఎం సాబ్ అలా ఆసుప‌త్రులు, రోగుల చుట్టూ తిర‌గ‌డం, పాలనలోనూ దూకుడు పెంచడం వెన‌క ఏదో బ‌ల‌మైన కార‌ణ‌మే ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. తనపై ఉన్న జనాగ్రహాన్ని గుర్తించడం వల్లే ఇంత‌లా యాక్టివ్ అయ్యార‌ని అంటున్నారు. ఇన్నాళ్లూ ఫాంహౌజ్ ముఖ్య‌మంత్రిగా.. మంత్రుల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం అందుబాటులో ఉండ‌ని సీఎంగా ముద్ర‌ప‌డి.. అప‌కీర్తి సొంతం చేసుకున్నారు. ఆ అపకీర్తిని తగ్గించుకునేందుకు కేసీఆర్ ఇలా నరుక్కొస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఫాం హౌజ్‌లో ప‌డుకునే కేసీఆర్‌.. ఇలా కొవిడ్ పేషెంట్స్ ద‌గ్గ‌రికి రావ‌డం వెనుక ఇదే కార‌ణ‌మై ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. ఆరోగ్య శాఖ నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌ను అన్యాయంగా పీకేశారనే చర్చ జనాల్లో జరుగుతోంది. ఈ టైమ్‌లో క‌రోనా విష‌యంలో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లో స‌ర్కారు ప‌రువు పోతుంది కాబ‌ట్టి.. ఆ బ‌ద్నామ్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే.. ఇలా క‌రోనా రివ్యూలు, ఆసుప‌త్రి సంద‌ర్శ‌న‌లు అంటూ..కొందరు అనాలిసిస్ చేసేస్తున్నారు. 

మరోవైపు కేసీఆర్ దూకుడుపై సోష‌ల్ మీడియాలో కొన్ని సెటైర్లు కూడా పేలుతున్నాయి. త‌న‌కు క‌రోనా సోకితే ప‌రీక్ష‌ల కోసం య‌శోదా హాస్పిట‌ల్‌కు వెళ్లిన కేసీఆర్‌.. ప‌రామ‌ర్శ‌ల‌కు మాత్రం గాంధీకి వెళ్లారు.. అదేదో అప్పుడే ఆ ప‌రీక్ష‌లేవో గాంధీలోనే చేసుకుంటే.. క‌నీసం ఆసుప‌త్రి అయినా బాగుప‌డేదిగా అంటూ కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ఏడాదిగా క‌మ్మేస్తుంటే.. అప్పుడు లేని ఈ సోయి.. ఇప్పుడే వ‌చ్చిందా? అంటూ సోష‌ల్ మీడియాలో కేసీఆర్‌కు తెగ‌ కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu