రాజకీయ వర్గాలలో అగ్గి రాజేసిన సెక్షన్: 8

 

భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ సలహా మేరకు కేంద్ర హోంశాఖ గవర్నర్ నరసింహన్ కు పునర్విభజన చట్టంలో సెక్షన్: 8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సర్వాధికారాలు చేప్పట్టేందుకు అనుమతించిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెక్షన్: 8లో మార్గదర్శకాలను వివరిస్తూ భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ గవర్నర్ కి వ్రాసిన లేఖ ప్రతిని ఒక ప్రముఖ తెలుగు మీడియా సంపాదించి అందులో వివరాలను బయటపెట్టింది. సెక్షన్: 8 అమలుని వ్యతిరేకిస్తూ నేటి నుండి తెలంగాణా వ్యాప్తంగా నిరసన దీక్షలు చేప్పట్టేందుకు ఉద్యోగ సంఘాలు, తెరాస శ్రేణులు సిద్దమవుతున్నాయి. అవసరమయితే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

 

కానీ తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెరాస సెక్రెటరీ జనరల్ కె. కేశవ్ రావు ఇరువురూ కూడా కేంద్రం అటువంటి నిర్ణయమేమీ తీసుకోలేదని గట్టిగా వాదిస్తున్నారు. అటువంటప్పుడు ఊహాజనితమయిన వార్తలను చూసి తెరాస నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నారు? నిరసనలు తెలపాలని ఎందుకు అనుకొంటున్నారు? అని ప్రశ్నించుకొంటే ఆ వార్తలు నిజమని వారు కూడా నమ్ముతున్నందునేనని అర్ధమవుతుంది. కానీ నిన్న గవర్నర్ నరసింహన్ తో గంటసేపు సమావేశమయిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఈ వార్తలను స్వయంగా దృవీకరించలేదు...అలాగే ఖండించలేదు కూడా. గవర్నర్ కార్యాలయం నుండి కూడా దీనిపై ఎటువంటి నిర్దిష్ట ప్రకటన వెలువడలేదు. కనుక దీనిపై అధికారికంగా ఒక ప్రకటన వెలువడేవరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు కూడా కొనసాగుతూనే ఉంటాయి.

 

గవర్నర్ సెక్షన్: 8ని అమలుచేస్తారో లేదో తెలియదు కానీ ఈ అంశం మీద మొదలయిన రభస మరికొంత కాలం కొనసాగితే త్వరలో జరుగనున్న జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాసకు లబ్ది కలుగవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.