అంబేడ్కర్, బాపూజీల ప్రస్తావన ఏది..?

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.  రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంటును ప్రారంభించిన  కొన్ని గంటలు కూడా గడవక ముందే.. ప్రతిపక్షాలు ఊహించి నట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ ఓ పని చేశారు.  కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వినాయక్ రావ్ దామోదర్ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.

స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీర సావర్కర్ త్యాగం సాహసం దృఢదీక్ష మనకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి "మన్ కీ బాత్'' కార్యక్రంలో కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర సావర్కర్ జయంతి ఈరోజు అని సావర్కర్ జైలు జీవితం అనుభవించిన అండమాన్ జైలును దర్శించేందుకు తాను వెళ్లిన రోజు నేటికీ మరిచిపోలేనని అన్నారు.

నిర్భీతికి ఆత్మగౌరవానికి సావర్కర్ ప్రతీక అని మోడీ అంటున్నారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సామాజిక సమానత్వం సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీలో చేసిన ట్వీట్లో వీడీ సావర్కర్ తన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల గుండెల్లో దేశ భక్తి ద్వీపాలను వెలిగించారని తెలిపారు. ఆయన దేశ భక్తి త్యాగం పట్టుదల ప్రశంసనీ యమనని అన్నారు. ఆ గుణాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.

ఆది నుంచి  కాంగ్రెస్ నేతలు సావార్కర్ ను  దేశ ద్రోహిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. సావార్కర్బపై రాహుల్ గాంధీ గతంలో విమర్శలు చేసిన సందర్భంలో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

మొత్తంగా పరిస్థితి కాంగ్రెస్, ప్రతిపక్షాలు  ఊహించినట్టే జరగడం.. తొలి రోజు పార్లమెంటు ప్రారంభించిన వెంటనే సావార్కర్ కు నివాళులర్పించడం గమనార్హం. అయితే..ఇదేసమయంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ ప్రస్తావనలు కనిపించకపోవడం గమనార్హం. 

అసత్యాలను సత్యాలుగా ..నమ్మే విధంగా ప్రచారం చేయడంలో మోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం.. చాలా వరకు సఫలమైందని, అయితే కొంత మందిని కొంత కాలం మోసం చేయొచ్చు..కాని, అన్ని వేళల అందరిని మోసం చేయడం కుదరదనే విషయాన్ని  బీజేపీ గుర్తుంచుకోవాలని ప్రతిపక్షాలు హితబోధ చేస్తున్నాయి.