డ్రగ్స్ కేస్ పై రోజా కామెంట్స్ సబబేనా?

 

ఒకే సినిమా ఇండస్ట్రీ. రెండు రకాల అభిప్రాయాలు! ఇదీ ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారణపై టాలీవుడ్లో పరిస్థితి. పూరీ, రవి, ఛార్మి లాంటి పాప్యులర్ సినిమా సెలబ్స్ ఈ కేసులో ఇరుక్కోవటంతో ఎక్కడలేని ఆసక్తి వచ్చి పడింది. అందుకు తగ్గట్టే మీడియా కూడా కాస్తంత మసాలా యాడ్ చేస్తూ కవరేజ్ చేస్తోంది. కాని, సినిమా వాళ్ల విషయంలో అది మామూలే. వారి గురించి ఎప్పుడు ఏం చెప్పినా జనం చూస్తారు కాబట్టి టీఆర్పీల కోసం మీడియా ఒకింత హడావిడి ఎక్కువే చేస్తుంది. కాని, తమ సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ బోలెడంత ఇచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసిన టాలీవుడ్ వాళ్లు ఇప్పుడు అదే మీడియా నెగటివ్ గా కవరేజ్ ఇస్తుండటంతో చిటపటలాడుతున్నారు. అయితే, అటు సిట్ కాని, ఇటు మీడియా కాని తప్పేం చేయటం లేదని అంటున్న వారు కూడా ఇండస్ట్రీలోనే వున్నారు!

 

ఎక్సైజ్ శాక తీరుని తప్పుబట్టిన తాజా టాలీవుడ్ సెలబ్రిటీ ఎమ్మెల్యే రోజా. ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ఆమె తనకు అలవాటున్న తీరులోనే స్పందించారు. సినిమా వాళ్ల పరువుని పోలీసు అధికారులు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. రేపు డ్రగ్స్ కేసులో పూరీ, ఛార్మి లాంటి వారి తప్పు లేదని తేలితే ఆ నష్టం సిట్ పూడుస్తుందా అంటూ ప్రశ్నించారు! ఇంచుమించూ ఇలాగే వర్మ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించటం మనకు తెలిసిందే!

 

రోజా, వర్మా లాంటి వారు విచారణ జరుగుతున్న తీరు తప్పుబడితే పోసాని రివర్స్ గేర్ లో వచ్చారు. ముప్పై వేల మంది వున్న ఇండస్ట్రీలో పన్నెండు మందికి నోటీసులిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముందని ఆయన అడిగారు! పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు, ఆరోపణలు ఎదుర్కొన్న వారు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని… కాని, అది తప్పదని ఆయన అన్నారు. పోసాని పూర్తిగా సిట్ ను సమర్థిస్తూ అకున్ సబర్వాల్ టీమ్ సినిమా వాళ్లకు గౌరవ, మర్యాదాలు బాగానే ఇస్తోందని చెప్పారు!

 

పోసాని , రోజా మాటల్లో ఎవరివి కరెక్ట్? వర్మ లాజిక్ సబబేనా? సినిమా వాళ్లు కాబట్టే సిట్ హడావిడి ఎక్కువ చేస్తోందా? మీడియా కోలాహలం అవసరానికి మించి జరుగుతోందా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు! కాని, సమాధానం మాత్రం ఒక్కటే! సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన చట్టం తన పని తాను చేసుకుపోకుండా… రూల్స్ , రెగ్యులేషన్స్ పెట్టడం ఎవరి తరమూ కాదు! అందరి లాగే గ్లామర్ లోకంలోని వార్ని కూడా విచారిస్తారు. అయితే, జనం, మీడియా కొంచెం ఎక్కువ దృష్టి పెడితే ఎవ్వరూ చేయగలిగింది ఏం లేదు. గతంలో సంజయ్ దత్, సల్మాన్ లాంటి వారు కేసుల్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఇలాగే గందరగోళం చెలరేగింది. కాని, పోలీసులు, కోర్టులు సినిమా కన్సెషన్స్ ఏమీ ఇవ్వలేదు. చట్టం అందరికీ ఒకేలా పని చేస్తుందని తేల్చేశాయి. డ్రగ్స్ కేసు విషయంలో కూడా అంతే! రోజా లాంటి వారు ఎమ్మెల్యే పదవిలో వుంటూ మరింత బాధ్యతగా మాట్లాడితే బావుంటుంది! ఎందుకంటే, ఆమె వర్మ లాగా ఇష్టానుసారం మాట్లాడి తప్పించుకునే స్థితిలో లేదు కాబట్టి. ఆమె మాట వల్ల వైఎస్ఆర్సీపీ పై ప్రభావం పడుతుంది…