రామ్ నాథ్ కోవింద్… తొలి ప్రసంగం… మొదటి కలకలం!

 

భారత పద్నాలుగవ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విజయవంతంగా వివాదాల్లోకి ఎక్కారు! ప్రమాణ స్వీకారం చేసి 24గంటలు గడవక ముందే ఆయన మీద కాంగ్రెస్ నాయకులు చిర్రుబుర్రులాడుతున్నారు! అంతా భావించినట్టుగా రామ్ నాత్ భారతదేశ రెండో దళిత రాష్ట్రపతి మాత్రమే కాదు… మొట్ట మొదటి ఆరెస్సెస్ నేపథ్యం వున్న ప్రెసిడెంట్ కూడా! ఈ కారణంతోనే కాంగ్రెస్ వారికి రామ్ నాథ్ పై కాస్త ఎక్కువే అనుమానాలు వున్నట్టున్నాయి…

 

2014 మే నెల నుంచి భారత రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. ఇది ఎవరు ఒప్పుకోకున్నా నిజం! ఆరెస్సెస్ స్వయం సేవక్ గా ఊరారా తిరిగిన మోదీ దేశ ప్రధాని అయ్యారు! ఈ విషయం కాంగ్రెస్ తో సహా చాలా మంది సెక్యులర్ నేతలు, మేధావులు, కవులు, రచయితలు అంగీకరించలేకపోయారు! ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. అందుకే, పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొడవ చేస్తే మేధావులు అవార్డ్ వాప్సీ అంటూ కలకలం రేపుతుంటారు. ఈ తంతు ఇప్పుడు రాష్ట్రపతి విషయంలో కూడా కొనసాగేలా కనిపిస్తోంది…

 

రామ్ నాథ్ కూడా హిందూత్వ భావజాలం వున్న బీజేపి నేత. అందుకే, ఆయన దళితుడు అయినప్పటికీ లెప్టు పార్టీల వారు, మాయావతి మీరా కుమార్ కే మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు అనివార్యంగా రామ్ నాథ్ రాష్ట్రపతి అయిపోవటంతో కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆయన మీద అనుక్షణం అనుమానపు దృష్టితోనే ముందుకు సాగేలా పరిస్థితి కనిపిస్తోంది! ఈ కార్యక్రమం రామ్ నాథ్ తొలి ప్రసంగం నుంచే ప్రారంభమైపోయింది! పార్లమెంట్ ను ఉద్దేశించి రాష్ట్రపతి ఇచ్చిన స్పీచ్ లో నెహ్రు పేరు ఎక్కడా రాలేదని కాంగ్రెస్ వారు సభలో గందరగోళం చేశారు! ఇందిర పేరు కూడా రామ్ నాథ్ స్మరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు! ఏ సంబంధమూ లేని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ లాంటి వారి పేర్లను రామ్ నాథ్ తన ప్రసంగంలో చేర్చారని కాంగ్రెస్ నాయకులు గోలగోల చేశారు!

 

నెహ్రు తొలి ప్రధానిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా జాతికి చేసిన సేవ చాలా గొప్పది. అందులో సందేహం లేదు. కాని, ఆయన పేరు తన స్పీచ్ లో వుండాలా వద్దా అన్న నిర్ణయం రామ్ నాథ్ కోవిందే గాని ఇతరులు ఒత్తిడి చేయటానికి వీలులేదు. ఈ విషయం కాంగ్రెస్ వారు గ్రహించటం లేదు. పైగా కేవలం ఒక విమర్శో, కామెంటో చేసి ఊరుకోవాల్సిన అంశంపై సభను స్థభింపజేశారు. విలువైన పార్లమెంట్ సమాయాన్ని తమ పార్టీ గత ప్రధానుల కీర్తి కోసం వృథా చేశారు! ఇది పూర్తిగా కాంగ్రెస్ నేతల స్వామి భక్తే తప్ప మరొకటి కాదు. అసలు కోవింద్ ప్రసంగంపై అభిప్రాయాలు చెప్పటం గౌరవం అనిపించుకోదు. పోనీ చెప్పినా గంభీరంగా మాట్లాడటం కాకుండా అదొక వివాదాస్పద అంశంగా మార్చటం కాంగ్రెస్ కు ఏ మాత్రం శోభనివ్వదు. ఒక రాష్ట్రపతి ఎలా మాట్లాడాలో శాసించటం అంటే అది ఆ స్థాయిని అవమానించటమే అవుతుంది!

 

ఇప్పటికే మోదీ, రామ్ నాథ్ కీలకమైన పదవుల్ని చేపట్టగా మరో కాషాయ నేత మన వెంకయ్య నాయుడు త్వరలో ఉప రాష్ట్రపతి కానున్నారు! అంటే… రాజ్యసభ వారి చేతుల్లో వుంటుందన్నమాట! కాంగ్రెస్ , ఇతర లౌకిక పార్టీలు అప్పుడు ఎన్ని రకాల వివాదాలు లేవనెత్తుతాయో మనం ఊహించవచ్చు! కాని, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో, ప్రధాని వంటి కీలక పదవుల్లో వున్న వార్ని కేవలం వారి నేపథ్యం చూసి విమర్శించటం కాకుండా… సహేతుకంగా తప్పు పడితే ప్రతిపక్షాలకి కూడా జనంలో మైలేజ్ వస్తుంది. అలా కాకుండా ప్రసంగంలో నెహ్రు పేరు ప్రస్తావించలేదని ఆగ్రహానికి లోనైపోతే … దాన్ని సామాన్య జనం హర్షించరు. మరీ ముఖ్యంగా, అత్యున్నత పదవుల్ని వివాదాస్పదం చేస్తూ, విలువైన సభా సమయం వృథా చేస్తే ఎవ్వరూ అంగీకరించరు…