రేవంత్ వాహనంలో తనిఖీలు
posted on Nov 16, 2024 2:23PM
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. డబ్బు ప్రవాహాన్ని ఆపడానికి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అనుమానం వస్తే తనిఖీల విషయంలో ఎటువంటి మొహమాటానికీ తావివ్వడం లేదు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సొమ్ములను పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
జాతీయ స్థాయి నాయకుల వాహనాలను సైతం ఆపి నిర్మొహమాటంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే జనసేన ఉద్ధవ్ థాక్రే వాహనాలను పలుమార్లు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం కోసం మహారాష్ట్రకు వచ్చిన సమయంలో ఆయన ప్రయాణించిన హెలకాప్టర్ ను కూడా తనిఖీ చేశారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందంటూ నెటిజనులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.