చంద్రబాబుతో కేంద్ర మంత్రి జైశంకర్ భేటీ.. వైసీపీలో వణుకు ఎందుకంటే?

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్లారంటే.. కచ్చితంగా ఆయన కేంద్రం నుంచీ రాష్ట్రానికి ఏదో ఒక ప్రయోజనం సాధించుకు వస్తారు. ఇది ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరించే వాస్తవం. నిజానికి చంద్రబాబు కూడా హస్తిన పర్యటన అంటే ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ కంటే విత్త మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి కుమార స్వామి, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిలతో భేటీ అవుతారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి ఏయే ప్రయోజనాలు అందే అవకాశం ఉందో వాటిపై వారికి వినతులు సమర్పిస్తారు. అలాగే ఆయన పర్యటన తరువాత ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి కేటాయింపులపై ప్రకటన రావడం కద్దు. 

అయితే తాజా  చంద్రబాబు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు ఆయన వద్దకు వెళ్లి కలవడం కాకుండా స్వయంగా జయశంకర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. దీంతో చంద్రబాబు, జైశంకర్ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా వీరి భేటీ వైసీపీని వణికి పోయేలా చేస్తోంది.  వీరి భేటీ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించే అయి ఉంటుందన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుల్లో విదేశాల నుంచి రావలసిన సమాచారం కోసం గతంలోనే సీబీఐ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పలు లేఖలు రాసింది. వాటికి సంబంధించిన సమాధానాలు వస్తే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుంటుంది. చంద్రబాబు జైశంకర్ ల మధ్యా తాజాగా జరిగిన భేటీలో జగన్ అక్రమాస్తుల కేసుల గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ భయంతో వణికి పోతున్నది.  రాష్ట్రంలో చంద్రబాబు  సర్కార్ కొలువుదీరిన తరువాత గత ప్రభుత్వ అవినీతిపై, అక్రమంగా సొమ్ముతరలించిన వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

 ఆ క్రమంలోనే రాష్ట్రం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన సొమ్ముపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర సహకారం కోరేందుకే చంద్రబాబు విదేశాంగ మంత్రి జై శంకర్ తో భేటీ అయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  విదేశాంగమంత్రితో చంద్రబాబు భేటీ  వైసీపీని ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు.