కేటీఆర్ ఓ బిల్డప్ బాబాయ్.. కొండా విశ్వేశ్వరరెడ్డి

అమృత్ పథకంలో కుంభకోణంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చేసిందంతా ఒట్టుట్టి హడావుడేనా? ఆయనకు అసలు కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంటే దక్కలేదా? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఔననే అంటున్నారు. ఒక్క కాంగ్రెస్ నేతలే కాదు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అదే చెబుతున్నారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్ ది అంతా వట్టి బిల్డప్ మాత్రమేననీ, ఆయనకు అసలు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని డంకా బజాయించి మరీ చెబుతున్నారు.

ఒక ఎంపీగా ఈ విషయంలో తాను వాస్తవాలను తెలుసుకుని మరీ చెబుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కేటీఆర్ ఒక బిల్డప్ బాబాయ్ లో అబద్ధాలు చెబుతూ, అతిశయోక్తులు మాట్లాడుతూ పార్టీ క్యాడర్ ను భ్రమల్లో ఉంచుతున్నారని విమర్శించారు. ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి కేటీఆర్ నిజంగా మనోహర్ కట్టార్ ను కలిసి అమృత్ పథకంలో కుంభకోణంపై ఫిర్యాదు చేశారా అన్న విషయంలో  అనుమానం వచ్చి తాను స్వయంగా కేంద్ర మంత్రి పీఏతో మాట్లాడానని అప్పుడు వాస్తవం తెలిసిందని వివరించారు. 

అయినా కేటీఆర్ నిజంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తో భేటీ అయ్యి ఉంటే ఆ పొటో విడుదల చేయాలని సవాల్ విసిరారు. కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అప్పాయింట్ మెంట్ కోరిన సంగతి వాస్తవమేననీ, అయితే కేటీఆర్ ను మంత్రి కలవలేదనీ, ఆయనను బయట నుంచే పంపించేశారనీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టేశారు.  అసలు ఢిల్లీలో కేటీఆర్ ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలవలేదనీ, ఎవరూ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదనీ పేర్కొన్నారు. ఇంతకీ ఆయన ఢిల్లీలో కలిసింది ఎవరినయ్యా అంటే కాంగ్రెస్ నేతలను అని చెబుతున్నారు. వాస్తవానికి కేటీఆర్ ను అరెస్టు నుంచి కాపాడుతున్నది కాంగ్రెస్ నేతలేనని ఆయన అంటున్నారు. రేవంత్ సర్కార్ కేటీఆర్ ను అరెస్టు చేయాలని భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం అందుకు అంగీకరించడం లేదనీ, వాస్తవానికి కేటీఆర్ ను అరెస్టు నుంచి కాపాడుతున్నది కాంగ్రెస్ అగ్రనాయకత్వమేననీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.