ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు నోటీసులు
posted on Nov 16, 2024 1:22PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు జైపాల్ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న ఆయన శనివారం (నవం బర్ 17) జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నోటీసులు అందుకుని పోలీసుల విచారణకు హాజరు కావడం సంచలనం కలిగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్టైన సంగతి విదితమే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకరరావు అమెరికాలో తలదాచుకున్నారు. ఆయనకు అక్కడ గ్రీన్ కార్డ్ లభించిన నేపథ్యంలో విచారణ కోసం ఆయనను భారత్ రప్పించడం పోలీసులకు కష్ట సాధ్యంగా పరిణమించింది. ఇంటర్ పోల్ నోటీసు ద్వారా ఆయనను భారత్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న పోలీసులు అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. మరింత మంది బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.