చంద్రబాబు విజన్.. వైఎస్ వేగం... రేవంత్ నెల రోజుల పాలన!

తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి మంగళవారం (జనవరి 9) నాటికి సరిగ్గా నెల రోజులు పూర్తయ్యింవది. సీఎంగానే కాకుండా టీపీసీసీ చీఫ్‌గా కూడా జోడు బాధ్యతలను జమిలిగా నిర్వహిస్తున్న రేవంత్  సీఎంగా నెలరోజుల పాలనపై జనబాహుల్యంలో ప్రశంసలే వస్తున్నాయి. ఇక పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఆయన నెల రోజుల పాలన చూస్తే చంద్రబాబు దక్షత, వైఎస్ వేగం గుర్తుకు వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా   రేవంత్‌రెడ్డి సహజ సిద్ధమైన దూకుడు ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. అదే సమయంలో సంయమనంతో పార్టీలో అందరినీ కలుపుకుని వెడుతున్న తీరు పరిశీలకుల ప్రశంసలను అందుకుంటోంది.  అదీ కాకుండా ఈ నెల రోజులలో పార్టీలో ఎక్కడా రేవంత్ పట్ల చిన్న పాటి  వ్యతిరేకత కూడా కనిపించలేదు. సరికదా రేవంత్ సర్కార్ సమష్టిగా ముందుకు సాగుతోందన్న భావన కలిగింది. రేవంత్ కేబినెట్ సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో మంత్రులు స్వేచ్ఛగా స్వతంత్రంగా పని చేస్తున్నారు. సాధారణంగా గ్రూపు విభేదాలతో నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలతో  ఉండే కాంగ్రెస్ లో రేవంత్ సీఎం అయిన తరువాత సీన్ మారిపోయింది. విమర్శలు లేవు, విభేదాలు లేవు. ఎక్కడ చూసిన ఐకమత్యం, సమష్టితత్వం. ఆ కారణంగానే రేవంత్ నెళ్లాల పాలన రాష్ట్ర ప్రగతి, పురోగతి, ప్రజా సంక్షేమం విషయాలలో సవ్యంగా ముందుకు వెడుతున్నదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక పరిశీలకులు అయితే దూకుడు, సమన్వయం కలగలిసిన పరిణితి గలిగిన నేతగా రేవంత్ ఈ నెల రోజులలో తనను తాను ప్రూవ్ చేసుకున్నారని అంటున్నారు.  

అసెంబ్లీలో తన ముఖం చూడడానికే ఇష్టపడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎంగా పగ్గాలు అందుకున్న వెంటనే రేవంత్  ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు.  అదే సమయంలో కేసీఆర్ సర్కార్ అనితీని, అక్రమాలపై  చట్ట ప్రకారం చర్యలను తీసుకునే విధంగా దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేశారు.  ఇక ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధకారంలోకి తీసుకువచ్చిన తనకు పోటీగా సీఎం పదవి కోసం చివరి వరకూ పోటీ పడిన సీనియర్లతో సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు రేవంత్. రేవంత్‌.. తనతో సీఎం పదవికి పోటీ పడిన వారితో కలసి నడుస్తున్నారు. తన ఆలోచనలను వారితో పంచుకుంటున్నారు. సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఈ సందర్భంగానే వైఎస్ లోని వేగం, కలుపుగోలుతనం రేవంత్ లో కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక పాలనకు సంబంధించిన అంశాలలో..  సమీక్షలు, అధికారులతో భేటీలు- నిర్ణయాలు- మీడియాతో భేటీలు వంటి విషయంలో  చంద్రబాబులోని దక్షత కనిపిస్తోంది.  కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో సచివాలయం ప్రజలకు ప్రవేశార్హత లేని ప్రదేశంగా ఉండేది.  ఎమ్మెల్యేలకు సైతం నో ఎంట్రీ బోర్డులే దర్శనమిచ్చేవి.  ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. అలాగే కేసీఆర్ హయంలో ప్రగతి భవన్ దొరల కోటలను తలపించేది.  ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజా భవన్ అయిపోయింది. నిత్యం వందల వేల సంఖ్యలో ప్రజలు అక్కడకు వస్తున్నారు. అర్జీలు ఇస్తున్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు. రేవంత్ నివాసం కూడా నిత్యం జనసందోహంతో కళకళలాడుతోంది.  ప్రజలకు తేడా స్పష్టంగా తెలుస్తోంది. గడీల పాలన స్థానంలో  ప్రజాస్వామ్య పాలన వచ్చిందన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది.   మొత్తంగా నెల రోజుల పాలనలో రేవంత్ కు అన్ని వర్గాల నుంచీ అంటే ప్రజల నుంచీ, పరిశీలకుల నుంచీ, మేధావుల నుంచీ కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇదే ఒరవడిని రేవంత్ ముందు ముందు కూడా కొనసాగిస్తారని ఆశిద్దాం.