ఏపీలో బీజేపీ రాజకీయ పయనంపై క్లారిటీ?

అడ్డగోలు ప్రయోగాలతో  దక్షిణాది రాష్ట్రాలలో  పార్టీ ఉనికినే నామమాత్రంగా చేసిన కమలనాథులు ఇప్పుడు తప్పుటడుగులను సరిచేసుకునే ప్రయత్నంలో పడ్డారా? కర్నాటక, తెలంగాణలలో జరిగిన నష్టం జరిగిపోయింది. కనీసం ఏపీలోనైనా ఉనికి కాపాడుకుని జాగ్రత్త పడదామనుకుంటున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీకి ఏపీలో ఉన్న పట్టు శూన్యం అనే చెప్పాలి. కర్నాటకలో అధికారం చేజిక్కించుకున్న చరిత్ర ఉంది. తెలంగాణలో గట్టి పట్టు ఉంది. అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయినా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓట్లు, సీట్లూ కూడా పెరిగాయి.

అదే ఏపీ విషయానికి వస్తే ఆ పార్టీకి పట్టూ లేదు, ఓట్లూ లేవు, సీట్లూ రావు. ఈ విషయం కమలనాథులకూ స్పష్టంగా తెలుసు. గత ఎన్నికలలో  ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీకి వచ్చిన సీట్లు శూన్యం. ఓట్లు కూడా బొటాబొటీగా ఒక శాతం. అటువంటి రాష్ట్రంలో ఆ పార్టీ ఎన్నికల సమాయత్తం ఎలా ఉండాలి. అయితే గత నాలుగున్నరేళ్లుగా ఆ పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవ్వడానికి ఇసుమంతైనా ప్రయత్నించలేదు సరికదా, అధికార పక్షానికి అండగా నిలుస్తూ, విపక్షాన్ని బలహీనపరచడమే ధ్యేయం అన్నట్లుగా సాగింది. ఏపీలో తెలుగుదేశం బలహీనపడితే చాలు.. అధికార పక్షం జట్టు మనచేతుల్లోనే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడే తొక్కేయచ్చు అన్నట్లుగా బీజేపీ హై కమాండ్ ఏపీ విషయంలో వ్యవహరించింది. జగన్ అడ్గగోలు పాలనకు అంత కంటే అడ్డగోలుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతు ఇచ్చి అండగా నిలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. అసలే విభజన హామీల అమలు విషయంలో మొండి చేయి చూపిందన్న ఆగ్రహంతో ఉన్న జనాలకు.. పాలన అంటే బటన్ నొక్కుడే అన్న చందంగా ముందుకు సాగుతున్న జగన్ కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అండదండలు అందిస్తుండటంతో  ఆగ్రహం తీవ్ర వ్యతిరేకతగా మారింది.

ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత జ్ఝానోదయం అయినట్లుగా బీజేపీ జగన్ పార్టీకి దూరం జరుగుతోంది. అలా దూరం జరగడం వల్ల ప్రయోజనం లేదు కనుక రాష్ట్రంలో ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన ద్వారా తెలుగుదేశం పార్టీకి చేరువ కావడానికి పావులు కదుపుతోంది. జనసేన, తెలుగుదేశం పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. పొత్తు సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ నేతలు ఎవరికి తోచినట్లు వారు చేస్తున్న వ్యాఖ్యలతో ఒకింత అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న భిన్న వ్యాఖ్యలను పక్కన పెడితే ఒకటి మాత్రం స్పష్టమైపోయింది. బీజేపీ హై కమాండ్ ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసే వచ్చే ఎన్నికలలో సాగాలన్న నిర్ణయానికి వచ్చేసింది.

ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ భేటీ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.  అనుభవమయితేగానీ తత్వం బోధపడదన్నట్లుగా ఇంత కాలం అధికార వైసీపీతో అంటకాగి  ఇప్పుడు నిండా మునిగిన తర్వాత  దిద్దుబాటకు దిగింది. ఇప్పటి దాకా అసలు ఏపీలో ఎవరితోనూ పొత్తులు వద్దని, ఐదారు సీట్ల కోసం పొత్తులు పెట్టుకోవలసిన పనిలేదనీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌జీ  తన వద్దకు వచ్చిన సీనియర్లకు చెబుతూ వచ్చారు. అయితే  తాజాగా విజయవాడలో  పార్టీ  కోర్‌ కమిటీ, ముఖ్యనేతల సమావేశంలో మాత్రం అదే సంతోష్ జీ అందుకు పూర్తి భిన్నమైన వైఖరి ప్రదర్శించారని అంటున్నారు. స్వయంగా సంతోష్ జీ సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ, హాజరైన ఆ  పార్టీ జాతీయ సహ సంఘటనా మంత్రి శివప్రకాష్‌జీ స్వయంగా పొత్తు ప్రస్తావన తీసుకు వచ్చారు. తొలుత అసలు ఎన్నికల్లో పొత్తు ఉండదన్న భావనతో, నాయకులు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత పొత్తు ఉంటే ఎలా ఉంటుంది? లేకపోతే ఎలా ఉంటుంది? అని ఆయనే ప్రశ్నించారట. దానితో పొత్తుల విషయంలో పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు వచ్చిందని పార్టీ రాష్ట్ర నేతలకు బోధపడిపోయింది.  టీడీపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న అంశంపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చారు.   అసలు పొత్తే వద్దన్న పరిస్థితి నుంచి.. పొత్తు ఉంటే ఎలా ఉంటుందన్న అభిప్రాయ సేకరణ వరకూ వ్యవహారం వచ్చిందంటే.. నేడో రేపో పొత్తు దిశగా కార్యాచరణ కూడా ప్రారంభమైనా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.