ఇస్రో కొత్త చైర్మన్ నారాయణన్
posted on Jan 8, 2025 8:36AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్‌గా వీ నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా ఉన్న సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం జరిగింది. ఇస్రో కొత్త చైర్మన్ గా నారాయణన్ ఈ నెల 14న బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈయన రెండేళ్ల పాటు ఇస్రో చైర్మన్ గా ఉంటారు. నారాయణన్ ప్రస్తుతం శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అందులో ఉపయోగించే కెమికల్స్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్, లిక్విడ్, సెమీ క్రయోజనిక్, క్రయోజనిక్ ప్రొపల్షన్ దశల్ని పర్యవేక్షించే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈయనను ఇస్రో కొత్త చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక ఈ నెల 13న అంటే సోమవారం పదవీ విరణమ చేయనున్న ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ 2022 జనవరిలో పదవీ ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. సోమనాథ్ హయాంలోనే ఇస్రో తొలిసారిగా చంద్రుని దక్షిణ ధృవంపై రోవర్‌ని విజయవంతంగా లాంచ్ చేసింది. చంద్రునిపై రోవర్ విజయవంతంగా లాంచ్ చేసిన అమెరికా, రష్యా, చైనా సరసన ఇండియా చేరింది కూడా ఈయన హయాంలోనే.