రాయలసీమ అభివృద్దికి రాజధాని అవసరమా?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో ప్రకటించడంతో ఆ అంశంపై గత మూడు నెలలుగా సాగుతున్న సస్పెన్స్ డ్రామాకు తెర పడింది. కానీ రాయలసీమ ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేఖంగా ఉద్యమబాట పట్టడం చాలా ఆందోళన కలిగిస్తోంది.

 

మొదటి నుండి పాలకుల నిర్లక్ష్యానికి గురయిన రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేదు. కనుక కనీసం ఇప్పుడయినా రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే వారి కోరికకు విరుద్దంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడంతో అక్కడి ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేదన కలగడం సహజమే. అందుకే వారు ఉద్యమబాట పట్టారు. అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి వారి కష్టాలు, సమస్యలు, అవసరాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆయన కేవలం రాజధాని ప్రకటనతో సరిపెట్టేయకుండా దానితో బాటు రాయలసీమ సత్వర అభివృద్ధికి తన కార్యప్రణాళికను కూడా ప్రకటించారు.

 

అయితే ఇంతవరకు రాష్ట్రాన్ని ఏలిన రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండి ఉంటే నేడు ప్రజలలో ఈ ఆందోళన ఉండేది కాదు. కానీ రాష్ట్ర విభజనను కలలో కూడా ఊహించని కారణంగా చంద్రబాబుతో సహా ముఖ్యమంత్రులు అందరూ కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు. తత్ఫలితంగా రాయలసీమ వెనుకబడిపోయింది. అంతేకాదు రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధిని పణంగా పెట్టి మరీ కష్టపడి అభివృద్ధి చేసుకొన్న హైదరబాదును పోగొట్టుకోవలసి వచ్చింది.

 

రాష్ట్రవిభజన నేర్పిన ఈ గుణపాటంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో 13జిల్లాలు సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. కానీ అభివృద్ధి మళ్ళీ కేవలం కాగితాలకే పరిమితమయితే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయవలసిందే.

 

అందువలన ప్రభుత్వం ప్రకటించిన తన అభివృద్ధి ప్రణాళికను అమలుచేసేందుకు రాయలసీమ ప్రజలు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం మంచిది. రాష్ట్ర విభజన సందర్భంగా కొందరు రాజకీయ నాయకులు, పార్టీలు ఆడిన నాటకాలు ప్రజలందరూ స్వయంగా చూసారు. వారిని ప్రజలు కటినంగా శిక్షించారు కూడా. కనుక మళ్ళీ అటువంటి స్వార్ధ రాజకీయ నాయకులను నమ్మి ఉద్యమాలు మొదలుపెట్టడం వలన కేవలం వారు మాత్రమే రాజకీయంగా లబ్ది పొందుతారు తప్ప రాయలసీమకు మేలు జరుగదు. కనుక రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాయలసీమ ప్రజలు ఇప్పుడు రాజధాని కోసం పట్టుబట్టడం కంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందేవరకు కూడా తమ ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మంచి పద్దతని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం కూడా అంగీకరించింది గనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు వీలయినంత త్వరగా పనులు మొదలుపెడితే ఆ రెండు ప్రాంతాల ప్రజలలో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.