వ్యూహాత్మకంగా వ్యవహారించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల

 

ఊహించినట్లే తెదేపా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరులతో కలిసి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో నిన్న జేరిపోయారు. బహుశః త్వరలోనే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కవచ్చును. రాజకీయ నేతలు పార్టీలు మారడం, ఆ సందర్భంగా నాలుగు ముక్కలు మాట్లాడటం చాలా సహజమే కనుక ఈ సందర్భంగా వారిరువురూ మాటలు కూడా ఆ కోవకే చెందినవని అందరూ అనుకోవచ్చును. కానీ వారిరువురు ఈ సందర్భంగా వ్యవహరించిన, మాట్లాడిన తీరు వారి రాజకీయ పరిణతికి, ఆశలకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ‘నిజానికి ఆయన స్థాయి నేతకు ఈవిధంగా తెలంగాణాలో భవన్ లో కాక నిజాం కాలేజీ మైదానంలో పెద్ద సభను ఏర్పాటు చేసి స్వాగతం పలకాల్సి ఉందని’ అనడం, అదేవిధంగా తుమ్మలతో తన అనుబంధం జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన తన చిరకాల మిత్రుడు, ఆప్తుడని అందరి ముందు చెప్పడం గమనిస్తే కేసీఆర్ తను ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నానని, తుమ్మలకే కాక తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు, చివరికి తెదేపా నేతలకు కూడా కేసీఆర్ ఒక సందేశం ఇచ్చినట్లు అర్ధమవుతోంది. తద్వారా మున్ముందు మరింతమంది తెదేపా నేతలు తెరాసలోకి ఆకర్షింపబడే అవకాశం కూడా ఉంది.

 

తుమ్మలకు జిల్లా సమస్యలు, వనరులు, రాజకీయాలపై మంచి అవగాహన ఉందని, జిల్లాలో తెదేపా, తెరాస నేతలు, కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నందున, ఆయనకే ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించాలని తను భావిస్తున్నట్లు ప్రకటించడం కూడా వ్యూహాత్మకమే. ఎందువలన అంటే మొదటి నుండి ఖమ్మం జిల్లా తెదేపాకు కంచుకోటలా నిలబడి ఉంది. దానిలోకి ప్రవేశించాలని తెరాస చేసిన ప్రయత్నాలేవీ ఇంతవరకు ఫలించలేదు. కానీ ఇప్పుడు జిల్లాలో మంచి బలమయిన నాయకుడిగా పేరున్న తుమ్మల తెరసలోకి చేరడంతో ఇప్పుడు ఆ కంచుకోటను బ్రద్దలు కొట్టేందుకు కేసీఆర్ కు అవకాశం దొరికినట్లయింది. అందుకే ఆ కోటపై పట్టున్న తుమ్మలకే ‘ఆ పని’ అప్పగిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయనకు తను చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు విస్పష్టంగా తెలియజేసారు.

 

ఈ సందర్భంగా ఆయన త్వరలోనే ఖమ్మం జిల్లాను రెండుగా విడదీయాలనుకొంటున్నట్లు ప్రకటించడం కూడా గమనార్హమయిన విషయమే. తమ పార్టీ అధికారం చేప్పట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం 20 జిల్లాలుగా మార్చుతామని కేసీఆర్ ఇదివరకే చాలాసార్లు చెప్పారు. చెప్పడమే కాకుండా అప్పుడే ఆ దిశలో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. కానీ ఈ సందర్భంగా ఆయన ఖమ్మం జిల్లాను రెండుగా విడదీయలనుకొంటున్నట్లు చెప్పడం మాత్రం కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాక, ఆ జిల్లాపై మంచి పట్టున్న తెదేపా, నామ నాగేశ్వరరావు తదితర నేతల పరిధిని, వారి ప్రభావాన్ని కుచింపజేసి, అక్కడ తుమ్మల సారధ్యంలో తెరాసను బలోపేతం చేయడం కూడా ఒక లక్ష్యంమని భావించవచ్చును. ఇకపై తాను తరచూ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

 

ఇక తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసుకొనేందుకు, తెలంగాణా అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ కు అండగా నిలబడేందుకే తాను తెరాసలో చేరుతున్నానని ప్రకటించినప్పటికీ అసలు కారణాలు వేరని అందరికీ తెలుసు. ఆయనకు జిల్లాలో నామా నాగేశ్వరరావుతో అభిప్రాయబేధాలు తత్సంబంధిత కారణాల వల్లనే ఆయన తెదేపాను వీడి తెరాసలో చేరారని అందరికీ తెలుసు. ఆయన పరిస్థితిని గమనించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇదే అదునుగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం, మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వగైరాల పరిణామాలన్నీ తుమ్మలను తెరసవైపు నడిపించాయని చెప్పవచ్చును. తెదేపాలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో కేసీఆర్ నుండి ఆహ్వానం రావడంతో తుమ్మల పార్టీ మారారు తప్ప, పార్టీ మారేందుకు ఆయన చెపుతున్న ఇతర కారణాలు నిజం కాదని అర్ధమవుతోంది.

 

ఏమయినప్పటికీ తుమ్మల తెరాసలో చేరడం వలన ఖమ్మం జిల్లాలో తెరాస బలపడే అవకాశం ఉంటే, అధికార తెరాస పార్టీలో చేరడం వలన తుమ్మల కేవలం మంత్రి పదవి పొందడమే కాకుండా, జిల్లాలో మళ్ళీ చక్రం తిప్పగలుగుతారు. కనుక ఇది ఉభయతారకమని చెప్పవచ్చును. అయితే ఈ గడ్డు పరిస్థితిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది.