రేష‌న్ బియ్యం దందా.. ద్వారంపూడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

పేద‌ల‌కు అందాల్సిన రేష‌న్‌ బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంతోపాటు,  విదేశాల‌కు త‌ర‌లించి కోట్లాది రూపాయ‌లు దండుకున్న అవినీతిప‌రుల ఆట‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతోంది.  ఏపీలో తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి రాగానే రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా గుట్టు ర‌ట్ట‌వుతోంది. కాకినాడ కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత క‌నుస‌న్న‌ల్లో సాగుతున్న రేష‌న్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టేందుకు వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కాకినాడ తీరంలో అధికారులతో క‌లిసి గోడౌన్లు, మిల్లుల‌పై వ‌రుస దాడుల‌తో అవినీతిప‌రుల్లో వ‌ణుకు పుట్టిస్తున్నారు. ఇటీవ‌ల స్వ‌యంగా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆక‌స్మిక‌ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో భారీ మొత్తంలో బియ్యం అక్ర‌మ నిల్వ‌లు బ‌య‌ట‌ ప‌డ్డాయి. కాకినాడ యాంక‌రేజి పోర్టు ప‌రిధిలో విశ్వ‌ప్రియ ఎక్స్‌పోర్ట్స్ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ చేసిన 4 వేల 700 టన్నుల   రేషన్‌ బియ్యం గుట్టురట్టైంది. దీనికితోడు మిగిలిన మిల్లులు, గొడౌన్లలోనూ బియ్యం గుట్టలు కనిపించడంతో వాటిని కూడా అధికారులు సీజ్ చేశారు.

 రేష‌న్ ద్వారా పేద‌ల‌కు ఇచ్చే చౌక‌ బియ్యం ప‌క్క‌దారి ప‌డుతోంద‌ని, అందుకు కాకినాడ కేంద్రంగా ఉంద‌ని చాలాకాలంగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాకినాడ కేంద్రంగా రేష‌న్‌ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతవుతున్న‌ట్లు,  దీనివెనుక వైసీపీ నేతల పాత్ర ఉందని గ‌తంలో తెలుగుదేశం, జ‌న‌సేన   నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి రావ‌డంతో కాకినాడ కేంద్రంగా వైసీపీ నేతల క‌నుస‌న్న‌ల్లో సాగుతున్న బియ్యం అక్ర‌మ ర‌వాణాపై కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ క‌నుసన్న‌ల్లో పెద్ద‌ మొత్తంలో బియ్యం అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంద‌ని ఆధారాల‌తో స‌హా వివ‌రాలు సేక‌రించిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్,  ఆ వివ‌రాల‌ను సీఎం చంద్ర‌బాబు ముందు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ద్వారంపూడికి ఉచ్చు బిగిసినట్లేనని ఏపీ రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. రేష‌న్ బియ్యం దందాకు సంబంధించి ఆధారాల‌తోస‌హా చంద్ర‌బాబు చేతికి చేర‌డంతో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌, ఆయ‌న అనుచ‌రుల‌తోపాటు వారికి స‌హ‌క‌రించిన అధికారుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ంటున్నారు‌. ఎప్పుడు ఎవ‌రు క‌ట‌క‌టాల‌పాలు కావాల్సి వ‌స్తుందోన‌ని వ‌ణికిపోతున్నార‌ని ఏపీ అధికార వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. 

ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కాకినాడలో సాగుతున్న రేష‌న్ బియ్యం దందాపై దృష్టిపెట్ట‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయి. కాకినాడ‌లో ద్వారంపూడి కుటుంబ స‌భ్యుల క‌నుస‌న్న‌ల్లోనే బియ్యం అక్ర‌మంగా ఎగుమ‌తులు చేస్తున్నార‌ని ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్  గ‌తంలో ఆరోపించారు. ఆ స‌మ‌యంలో ద్వారంపూడి వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌ స్థాయిలో సాగింది. తాము అధికారంలోకి రాగానే బియ్యం దందాకు బ్రేక్ వేయ‌క‌పోతే త‌న పేరు  మార్చుకుంటాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌వాల్ అప్ప్టట్లో సవాల్ చేశారు. ఎన్నిక‌ల్లోతెలుగుదేశం కూట‌మి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను జ‌న‌సేన ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ కు అప్ప‌గించారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌వాల్ కు అనుగుణంగా అడుగులు వేశాడు. స్వ‌యంగా ఆయ‌నే కాకినాడ‌లోని మిల్లులు, గోడౌన్ వ‌ద్ద‌కు వెళ్లి త‌నిఖీలు చేశాడు. ఆ త‌నిఖీల్లో పెద్ద మొత్తంలో రేష‌న్ బియ్యం దందా వెలుగులోకి వ‌చ్చింది. 

ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురం వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్  ఇదే విష‌యం  ప్ర‌స్తావించారు. కాకినాడలో బియ్యం దందాపై ప‌వ‌న్ మ‌రోసారి స్పందించ‌డం చూస్తే అక్రమార్కుల భరతం పట్టేంతవరకు వదిలే ప్రసక్తేలేదన్న సంకేతాలిచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో సివిల్ స‌ప్ల‌య్ మంత్రులుగా కొడాలి నాని, ఆ త‌రువాత కానుమూరి నాగేశ్వ‌ర‌రావు  ప‌నిచేశారు. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్, ఆయ‌న అనుచ‌రులు సాగించిన రేష‌న్ బియ్యం దందాలో మాజీ మంత్రుల ప్ర‌మేయం ఎంత ఉంద‌నే వివ‌రాలను సైతం ప్ర‌భుత్వ  పెద్ద‌లు కూపీలాగుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రేష‌న్ బియ్యం దందాకు సంబంధించిన గుట్టు ర‌ట్ట‌వుతుండ‌టం పట్ల సర్వత్రా  హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి.