పూటకో మాట.. రోజుకో ఆరోపణ.. ఓటమి షాక్ లోనే జగన్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచిపోయాయి. జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.   జనం తీర్పుతో జగన్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమి షాక్ నుంచి నెలరోజులైనా తేరుకోలేదు. అసలు ఓటమికి కారణాలేమిటి అన్నది సమీక్షించుకుని, ఆత్మ విమర్శ చేసుకుని పోరపాట్లు, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజాభిమానాన్ని చూరగొనాలన్న దిశగా ఆయన అడుగులు పడటం లేదు. అసలు ఆయన తన పార్టీ అధికారం కోల్పోవడం వెనుక ఎదో కుట్ర, ఎవరిదో హస్తం ఉందన్న భ్రమల్లోనే ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో తన పార్టీ ఘోర పరాజయానికి ఆయన పలు రకాల కారణాలు చెప్పారు. ఒక సారి చెప్పిన కారణం మరోసారి చెప్పకుండా తానెంత అయోమయంలో ఉన్నారో స్వయంగా చాటుకుంటున్నారు. ప్రజలు తనను తిరస్కరించారన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆయన చేస్తున్న విన్యాసాలు, బెబుతున్న మాటలతో మరింతగా నవ్వుల పాలవుతున్నారు.

నిజానికి రాజకీయ నాయకుల కంటే జనం ఎంతో తెలివైన వారు. ఒక పార్టీ గెలుపు ఓటములను జనం నిర్దేశించడం వెనుక బలమైన కారణం ఉంటుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా జనం కోరుకుంటారు. తమ ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించే నేతలకు ఓటుతో బుద్ధి చెబుతారు. జగన్ విషయంలో అదే జరిగింది. ఎంత సేపూ ఉచితాలు అందించాను. అప్పనంగా సొమ్ములు పందేరం చేశారు. తానందించిన సంక్షేమాన్ని అందుకుని ఓట్లేయలేదంటూ జనాన్ని నిందించి ప్రయోజనం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం జగన్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తనను ఓడించిన ప్రజలను నిందించారు. కోట్ల రూపాయలు పందేరం చేశా, ఆ సొమ్ములు అందుకున్న అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతల ఓట్లేమయ్యాయి? అంటూ అతి కష్టంమ్మీద కన్నీళ్లను ఆపుకుంటూ ప్రశ్నలు సంధించారు. అంతే కాదు.. నా చేతుల్లో ఏం లేదు. అంటూ నిర్వేదం ప్రదర్శించారు. 

ఆ తరువాత జూన్ 13న జగన్  పార్టీ నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో  ఆయన తమ ఓటమికి ఈవీఎంలను నిందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఓటమిపాలయ్యానని చెప్పారు. ఐదు రోజుల తరువాత ఆయన అంటే జూన్ 18న జగన్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఓ సందేశంలో ప్రపంచ వ్యాప్తంగా  అన్ని దేశాలూ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయనీ, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడాలంటే ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని పేర్కొన్నారు. 

ఇక తాజాగా గురువారం (జులై 4) నెల్లూరు జైలులో  వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ తరువాత బయటకు వచ్చి చేసిన ప్రసంగంలో ఎక్కడా ఈవీఎంల ప్రస్తావన తీసుకురాలేదు. చంద్రబాబు హామీలను నమ్మి జనం ఆయనను గెలిపించారని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని నిందించారు. అంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే జగన్ తన ఓటమికి ప్రజలను నిందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమి పాలయ్యానని భోరుమన్నారు. ఇప్పుడు జనం చంద్రబాబు మాయలో పడి తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కానీ తన విధానాలు, వేధింపులు, కక్ష పూరిత రాజకీయాలు, అభివృద్ధి ఊసే లేకుండా సాగించిన పాలన కారణంగానే జనం తనను తిరస్కరించాన్న గ్రహింపునకు మాత్రం రాలేదు.