వైసీపీలో పాక పీకేసిన రాపాక!

గతంలో మాయలు, మంత్రాలు, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యల్లాంటివి వుండేవి అంటూ వుంటారు. కానీ ఇప్పుడు ఆ విద్యలు తెలిసినవాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఒకవేళ అక్కడడక్కడా ఒక్కళ్ళో, ఇద్దరో వున్నా, కొంతమంది రాజకీయ నాయకులను చూసి, వాళ్ళముందు తాము ఎందుకూ పనికిరామని తెలుసుకుని, తమకు వచ్చిన విద్యలు కూడా మరచిపోయి వుంటారు. అలాంటి కొంతమంది రాజకీయ నాయకులలో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ని కూడా చేర్చవచ్చేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయారు. అన్ని స్థానాలకు పోటీ చేసినప్పటికీ ఒక్క రాజోలులో తప్ప జనసేన పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ విజయం దక్కలేదు. అలా జనసేన తరఫున ఏపీ అసెంబ్లీలో ‘ఏక్‌నిరంజన్’గా రాపాక గుర్తింపు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో జనసేన గళం వినిపించడానికి ఒక్క రాపాక అయినా మిగిలారని జనసేన వర్గాలు భావించాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతకాలం రాముడు మంచి బాలుడిలా బుద్ధిగా వున్న రాపాక, ఆ తర్వాత పవన్ కళ్యాణ్’కి తన విశ్వరూపం చూపించారు. మెల్లగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడ్డం ప్రారంభించి, ఆ తర్వాత స్వరం పెంచారు. చివరికి జనసేన మీదే విమర్శలు చేసి వైసీపీలో పాక వేశారు. వైసీపీలో చేరిన ఉత్సాహంలో వున్న రాపాక అప్పట్లో జనసేన పార్టీ ఎప్పటికీ గెలిచే పార్టీ కాదని, ఏదో తాను ఒక్కడిని గాలివాటంగా గెలిచాను తప్ప, భవిష్యత్తులో జనసేనకు ఒక్క స్థానంలో కూడా విజయం సాధించదు అని కరాఖండీగా చెప్పేశారు. అలాంటి రాపాక మొన్నటి ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన పార్టీతోపాటు తాను  కూడా విజయవంతంగా ఓడిపోయారు. 

వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలో గత నాలుగు నెలలుగా ఉగ్గబట్టుకుని వున్న రాపాక ఇప్పుడు మెల్లగా తన ఒరిజినల్ స్ట్రేటజీ బయటకి తీశారు. వైసీపీని విమర్శిస్తూ ప్రకటన చేశారు. తనకు వైసీపీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, తనను రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి అమలాపురం పార్లమెంట్ స్థానానికి వద్దు మొర్రో అన్నా వినకుండా పంపించారని, పార్టీలో తన మాటకు విలువ లేదు కాబట్టి తాను వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. ఇంతవరకు బాగానే వుందిగానీ, రాపాకని టక్కుటమార విద్యలు తెలిసిన వాళ్ళతో ఎందుకు పోల్చినట్టా అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.

ఏ జనసేన పార్టీ అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించిందో, ఆ జనసేన పార్టీ నమ్మకాన్ని పోగొట్టుకుని వైసీపీలో చేరిన రాపాక ఇప్పుడు ఎంతమాత్రం సిగ్గుపడకుండా, మొహమాటపడకుండా జనసేనలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో ఆదివారం నాడు జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిలవని పేరంటానికి వచ్చినట్టు రాపాక వరప్రసాద్ వచ్చేశారు. అక్కడకి వచ్చిన రాపాకని చూసి అందరూ షాకైపోయారు. రాపాక మెల్లగా అక్కడే వున్న రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ని కలసి మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే, మళ్ళీ జనసేనలో చేరడానికి పవన్ కళ్యాణ్‌తో రాయబారం చేయాల్సిన బాధ్యతని దేవవరప్రసాద్‌కి అప్పగించారని జనసేనలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నమ్మకం మీద తీవ్రమైన దెబ్బ కొట్టిన రాపాకను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోకూడదని జనసేన నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. మరి జనసేన అధినేత రాపాకకి నో చెబుతారో... జనసేనలో మరోసారి పాక వేసుకోమని ఎంకరేజ్ చేస్తారో చూడాలి.