మద్యం లాటరీ పండుగ సంపూర్ణం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు ఒకవైపు పల్లె పండుగ కార్యక్రమం జరిగితే, మరోవైపు మద్యం షాపుల లాటరీ పండుగ జరిగింది. ఈ పండుగ వాతావరణాన్ని చూసి పులకరించిన ప్రకృతి ఆనంద బాష్పాలలను కారుస్తూ వర్షాలు కురిపిస్తోంది. ఈ వర్ణనలు అలా వుంచితే, ఏపీలో తాజాగా తీసుకొచ్చిన కొత్త మద్యం విధానానికి అనుగుణంగా షాపుల కేటాయింపు లాటరీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల కేంద్రాల్లో సందడి సందడిగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లాటరీ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. పూర్తి బందోబస్తు మధ్య మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ తీశారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మధ్యం దుకాణాల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల నుంచి ప్రభుత్వం నాన్ రిఫండబుల్ డిపాజిట్ రూపంలో దాదాపు 1,798 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మద్యం లాటరీలో పేరు వచ్చిందా హ్యాపీ.. పేరు రాకపోతే షాపు రాదు.. డిపాజిట్ కూడా తిరిగి రాదు. మద్యం షాపు తమకు వస్తుందన్న ఆశతో దరఖాస్తుదారులు రెండేసి లక్షల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించారు. లాటరీలో పేర్లు వచ్చిన దరఖాస్తుదారులు ఫుల్ బాటిల్ కొట్టినంతగా ఖుషీ అయిపోతుంటే, పేర్లు రాని దరఖాస్తుదారులు సమయానికి మందు దొరకని మందుబాబుల్లా డీలా అయిపోయారు. లాటరీలో పేర్లు వచ్చిన లక్కీ దరఖాస్తుదారులు 24 గంటల్లోగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి వుంటుంది. దాంతో లాటరీ విజేతలు డబ్బు సమీకరించే పనుల్లో వున్నారు. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించినవారు ఈనెల 16 నుంచి ఎంచక్కా మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చు. మద్యం షాపుల విజేతలుగా నిలిచినవారిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా వున్నారు. ఇంకా ముఖ్యంగా పలువురు మహిళలు కూడా వున్నారు.