జేఎన్‌యూ వివాదం..రాంజాస్ కాలేజీలో ఘర్షణ

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన రాంజాస్ కాలేజీ ఇవాళ రణరంగంగా మారింది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. ఉమర్ ఖలీదు‌ను తమ కాలేజీలోకి రానిచ్చేది లేదంటూ ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు.

 

 

దీంతో ఉమర్ ఖలీద్‌తో పాటుగా షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ యాజమాన్యం రద్దు చేసింది. అయితే ఏబీవీపీ ఉద్దేశ్యపూర్వకంగానే కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్ ఢిల్లీ విద్యార్థులు ఆందోళనకు దిగి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు..దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన పలువురు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.