కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. స్పందించని తెలంగాణ సమాజం

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి ఒకదాని వెంట ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత నుంచి ఆ పార్టీ పరిస్థితి పతనం నుంచి మరింత పతనానికి జారిపోతున్న చందంగానే కనిపిస్తోంది. 

అయితే తమ ఓటమికి ప్రజా వ్యతిరేకత కారణం కాదనీ, ప్రజలు తమ వెంటే ఉన్నారనీ, కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపి ప్రజలను మభ్యపెట్టి గెలిచిందనీ చెప్పుకోవడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇసుమంతైనా సందేహించడం లేదు. అయితే వారి మాటలను జనం విశ్వసిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలూ, శ్రేణులే విశ్వసించడం లేదనడానికి ఆ పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న వలసలే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ పరిస్థితి కడు దయనీయంగా మారిందంటున్నారు. అధినేత కేసీఆర్ బస్సు యాత్ర వినా.. బీఆర్ఎస్ ప్రచారంలో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. ముందే పరాజయాన్ని అంగీకరించేసినట్లుగా అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారంపై దృష్టి సారించడం లేదు. కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గాలలో జరిగే సభలకే ఆ పార్టీ ప్రచారం పరిమితమైనట్లుగా కనిపిస్తోంది. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే పార్టీ క్యాడర్ తో సమావేశాలతోనే ప్రచారాన్ని మమ అనిపించేస్తున్నారు. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ప్రచారం మొత్తం రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోయడానికే పరిమితమైంది. నిండా ఆరు నెలలు కూడా నిండని రేవంత్ సర్కార్ పై విమర్శలను మించి దూషణలతో విరుచుకుపడుతూ అదే ప్రచారం అని జనాలను నమ్మించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది.  అభ్యంతరకరంగా మాట్లాడారంటూ కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించింది.

నిన్నమొన్నటి వరకూ రాష్ట్రంలో రాజకీయాలను కనుసైగతో సాధించిన కేసీఆర్ ను అధికారం కలోయిన క్షణం నుంచి ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి. పార్టీ పరాజయం పాలైన నాడే తన ఫామ్ హౌస్ బాత్ రూంలో కాలుజారి గాయపడ్డారు. దాని నుంచి కోలుకుని ప్రజలలోకి రావడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈ లోగానే పార్టీ నుంచి వలసల వరద మొదలైంది.  పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా కారు దిగేశారు. సరే ఆరోగ్యం కుదుటపడింది. వలసల వల్ల పార్టీకి నష్టం లేదు, పార్టీ వీడిన వారంతా  తెలంగాణ ద్రోహులు అంటూ ఆయన హుంకరించడం మొదలు పెట్టారో లేదో.. ఆయన కుమార్తె   కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై  తీహార్ జైలుకు వెళ్లారు.

దాని నుంచి తేరుకుని కేంద్రం కుట్ర అంటూ ఆరోపణలు గుప్పించడానికి రెడీ అవుతుండగానే  కూడా ఫోన్ టాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు అరెస్టులు జరిగి.. ట్యాపింగ్ ఉచ్చు నేరుగా పార్టీ నేతల మెడకే చుట్టుకునే ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వచ్చాయి. ఇన్ని కష్టాల నడుమ పార్టీనీ  పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దచేసే పనిలో వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ప్రసంగాలలో సంయమనం కోల్పోయారు.  సిరిసిల్ల సభలో  కేసీఆర్ కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారంటూ అందిన ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకుంది. బుధవారం (మే 1) రాత్రి 8 గంటల నుంచిఈ   48 గంటల పాటు అంటే శుక్రవారం (మే 3) రాత్రి ఎనిమిది గంటల వరకూ కేసీఆర్ ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించింది. ఆ 48 గంటలూ కేసీఆర్ ఎటువంటి  సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూ లలో పాల్గొనకూడదు. 

అయితే ఈసీ చర్యల పై స్పందించిన కేసీఆర్ తన మాటలు, స్థానిక మాండలికం ఈసీ అధికారులకు అర్ధం కాలేదంటూ నిందలు వేశారు.  తన ప్రచారాన్ని 48 గంటలు నిషేధిస్తే లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా 96 గంటల పాటు ప్రచారం చేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆయనపై నిషేధం విధించి గంటలు గడిచినా తెలంగాణలో ఎక్కడా నిరసన అన్నదే కనిపించని పరిస్ధితి ఉంది.  కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపునకు తెలంగాణ ప్రజల నుంచి స్పందన కరవైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ విధించిన నిషేధంపై ప్రజల నుంచి ఎటువంటి నిరసనలూ వ్యక్తం కావడం లేదు. ఆయన భాష అభ్యంతరకరంగానే ఉందన్న చర్చ కూడా జనబాహుల్యంలో సాగుతోంది. పరిశీలకులు సైతం అదే మాట చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం బీఆర్ఎస్ కు గోరుచుట్టుపై రోకలి పోటువంటిదేనని అంటున్నారు.