పిఠాపురంలో వంగా గీతకు మూసుకుపోయిన గెలుపు దారులు!?

రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా  కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో వంగా గీతకు గెలుపు దారులు మూసుకుపోయాయంటున్నారు. ఒక వైపు పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మిథున్ రెడ్డి వంటి వారికి బాధ్యతలు అప్పగించినా.. నియోజకవర్గంలో పరిస్థితి రోజురోజుకూ వైసీపీకి ప్రతికేలంగా, జనసేనకు అనుకూలంగా మారుతున్నదని పరిశీలకులు అంటున్నారు.

కూటమి అభ్యర్థిగా జనసేనానికి తెలుగుదేశం అండ కొండంత బలంగా మారిందంటున్నారు. కాపుసామాజిక వర్గ ఓట్లలో చీలిక కోసం కాపు ఉద్యమ నేతగా తనను తాను అభివర్ణించుకుంటున్న ముద్రగడ పద్మనాభంకు వైసీపీ కండువా కప్పి ప్రచారంలోకి దింపినా పెద్దగా ఫలితం కనిపించకపోవడం అటుంచి.. పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ చేసిన సవాల్ బూమరాంగ్ అయ్యిందంటున్నారు. 

ఇక అన్నిటికీ మించి వైసీపీని, ఆ పార్టీ అభ్యర్థి వంగాగీతనూ ఆందోళనకు గురిచేస్తున్న అంశం పిఠాపురంలో పవన్ కు మద్దతుగా సినీనటుల ప్రచారం. ఇప్పటికే హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లు పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  వీరంతా బుల్లితెర ద్వారా ప్రజలలో మంచి గుర్తింపు పొందిన వారే కావడం గమనార్హం. వీరి ప్రచారానికి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇక ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే తన మేనమామకు మద్దతుగా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రానున్న రోజులలో  రామ్ చరణ్, చిరంజీవి కూడా పవన్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జనసేన ప్రచారం ముందు వైసీపీ ప్రచారం వెలతెలపోతున్నదంటున్నారు.  

ఓటమి భయంతోనే  పవన్ కల్యాణ్  హైదరాబాద్ లో ఉండే  నటులలో సగం మందిని పిఠాపురంలో దింపారన్న వంగా గీత విమర్శలు ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆ విమర్శలు ఆమెలోని ఓటమి భయాన్నే ఎత్తి చూపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల మూడ్ ను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తేలిపోయిందంటున్నారు.  వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతోందంటున్నారు.