రామ్ చరణ్ అంటే మీడియాకు అంత ఇది దేనికో?
posted on Feb 9, 2015 7:12PM
.jpg)
నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ వస్తుందని రామ్ చరణ్ తేజ్ వాదన. ఆదివారం రాత్రి తన ఇంట్లో స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకొంటూ కొంచెం చిందులు వేస్తే అది గిట్టని పక్కింటాయన పోలీసులకి పిర్యాదు చేసారని మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లేనని రామ్ చరణ్ తేజ్ కొట్టి పడేశాడు. అసలు అటువంటి వార్తలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదని బాధపడ్డాడు కూడా. అయితే రాత్రి తన ఇంట్లో స్నేహితులకు డిన్నర్ మాత్రమే ఇచ్చానని అంగీకరించాడు. మందు పార్టీకి...విందు భోజనానికి మధ్య ఉన్న చిన్న డిఫరెన్స్ తెలుసుకోకుండా మీడియా వాళ్ళు ఏదో వ్రాసేసి ఉంటారని సర్ది చెప్పుకొన్నాడు.
ఇదివరకు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కారు తన కారుకు అడ్డు వచ్చినప్పుడు కూడా రామ్ చరణ్ తేజ్, పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే పాపం వారిరువురి ఉద్యోగాలు పోతాయని జాలిపడి, తన తండ్రి చిరంజీవి సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ గార్డుల చేత వారిరువురినీ నడిరోడ్డు మీద మీడియా సాక్షిగా ఉతికి ఆరేయించాడు. అప్పుడు కూడా ఇలాగే ఆయన అమాయకంగా ఫేస్ పెట్టి తనంటే గిట్టని మీడియా వాళ్లెవరో తన ఫోటోలను కష్టపడి మార్ఫింగ్ చేసి, గాలి కబుర్లు పోగేసి ఏవేవో వ్రాసిపడేసారని నొచ్చుకొన్నాడు. అసలు ఈ మీడియావాళ్లకు రామ్ చరణ్ అంటే అంత ఇది ఎందుకో తెలియదు. కానీ వాళ్ళ రాతల కారణంగా పాపం ఆ పెద్దాయన కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది. కానీ ఆయనకి శపించే శక్తే తప్ప నిషేధించే శక్తి లేకపోవడంతో మీడియా బ్రతికిపోయింది.
ఆయన ఇన్నేళ్ళుగా సినిమాలలో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా ఏనాడూ కూడా ఇలాంటి వివాదాలలోకి వెళ్ళకుండా చాలా పరువుగా బ్రతికేసారు. కానీ ఏమిటో ఈ మీడియా నిప్పు లేకుండానే పొగ పుట్టించేస్తూ పాపం చెర్రీ బాబును తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. మీడియా ఎలాగు మారే అవకాశం లేదు. కనుక అదేదో చెర్రీ బాబే మారిపోతే ఆ పెద్దజీవి కూడా సంతోషిస్తారు కదా!