మళ్లీ ఆ ఇద్దరే.. మరి మూడో స్థానం ఎవరికి?
posted on Nov 27, 2024 8:52AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పని అయిపోయింది. ఇప్పట్లో ఆ పార్టీకి ఎటువంటి అవకాశాలూ దక్కే పరిస్థితి లేదు. ఇటు మండలిలో, అటు రాజ్యసభలో తమకు తెలుగుదేశం కూటమి కంటే బలం ఉందని తన భుజాలు తాను చరుచుకుని సంతృప్తిపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ పార్టీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ ను నమ్మే పరిస్థితులు ఇసుమంతైనా కనిపించడం లేదు.
ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. ఏ విధంగా చూసినా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలో వైపీపీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే నిలబెట్టినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ఆ మూడు స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులే ఎన్నికౌతారు. అయితే తెలుగుదేశం కూటమిలో రాజ్యసభకు వెళ్లేది ఎవరన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు వైసీపీ పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వాలకూ కూడా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. రాజీనామా చేసిన ముగ్గురిలో మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులు తెలుగుదేశం గూటికి చేరారు. అయితే ఆర్. కృష్ణయ్య మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు.. సరికదా, బీజీలకు రాజ్యాధికారం కోసం సొంతంగా పార్టీ ప్రారంభిస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ధోరణి వేరు. ఆయనను ఒక సీరియస్ పొలిటీషియన్ గా ఎవరూ పరిగణించే పరిస్థితి లేదు. చేరతానన్నా ఏ పార్టీ కూడా ఆయనకు రెడ్ కార్పెట్ వేసి వెల్ కమ్ చెప్పే అవకాశమూ లేదు. అన్నిటికీ మించి ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు తెలుగుదేశం కూటమి మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఇసుమంతైనా లేదు. ఆయనను పక్కన పెడితే... ఖాళీ అయిన మూడు స్థానాలలో రెండింటిని.. తాజా మాజీలు, అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. అంటే తెలుగుదేశం మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులనే తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
తెలుగుదేశం కూటమి వర్గాల నుంచీ అదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఖాళీ అయిన మూడో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం కూటమి పార్టీలలో పోటీ తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ స్థానం కోసం బీజేపీ, జనసేనలు గట్టిగా పట్టుబడుతున్నారని కూటమి వర్గాల్లో కూడా ప్రచారం అవుతోంది. కూటమి పార్టీల ఐక్యతకు భంగం వాటిల్లకుండా చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.