వెనక్కు వెళ్లే ప్రశ్నే లేదు.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలపై సుప్రీం

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే తమ పార్టీ ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైందని గగ్గోలు పెడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి అనూహ్య విజయం తరువాత కూడా జాతీయ స్థాయిలో పలు బీజేపీయేతర పార్టీలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

తాము విజయం సాధించిన సందర్భాలలో ఈవీఎంలు భేష్ అంటూ, ఓటమి పాలైతే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీలకు సుప్రీం కోర్టు తన తాజా తీర్పు ద్వారా చెక్ పెట్టింది. విషయమేంటంటే..  ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ ఇటీవల సుప్రీం కోర్టులో దేశంలో మళ్లీ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరిగే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వీబీ వార్లేలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం (నవంబర్ 26) డిస్మిస్ చేసింది.

ఈ సందర్భంగా  సుప్రీం కోర్టు మీరు గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ మాట ఉండదు. ఓటమి పాలైనప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా? అంటూ ప్రశ్నించింది.  విదేశాలలో ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలోనే జరుగుతున్నాయని పాల్ వాదనను కోర్టు తోసిపుచ్చుతూ భారత్  మిగిలిన దేశాల కంటే భిన్నంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించింది. చివరిగా పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.