రాహుల్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవా..పట్టాభిషేకమా?

న్యూఢిల్లీ: యువరాజు' రాహుల్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందా? సోనియా గురువారం ఢిల్లీలో అడుగు పెట్టీ పెట్టగానే... కాంగ్రెస్ యువ ఎంపీలు ప్రత్యేకంగా భేటీ కావడమే దీనికి సంకేతమా? ఇది ఢిల్లీ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీకి 'పదోన్నతి' కల్పించే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ పదోన్నతి... పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానా? ఏకంగా... ప్రధాన మంత్రిగానా? అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. తాను చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన సమయంలో ప్రభుత్వ విశ్వసనీయత పడిపోయిందని, ప్రధాని మన్మోహన్ కీలక నిర్ణయాలు తీసుకోలేక పోయారని సోనియాకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న సోనియా జోక్యం చేసుకున్న తర్వాతే ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్లు రంగంలోకి దిగి అన్నా హజారే దీక్షతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్‌పై యువ ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంపై పట్టు లేనందువల్లనే అన్నా హజారే ఉదంతంలో ప్రభుత్వం పరువు పోయిందని... మంత్రులు, పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేసి సంక్షోభం మరింత ముదిరేలా చేశారని వీరు పేర్కొంటున్నారు.

పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెరగాలంటే ప్రధానమంత్రిని మార్చక తప్పదని, రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పజెప్పాలనే వాదనను వారు లేవనెత్తుతున్నారు. రాహుల్‌కు ప్రధాని పదవి అప్పజెప్పి... మంత్రివర్గంలో యువతకు చోటిచ్చి అవినీతి నియంత్రణపై కదిలితే ప్రభుత్వ ప్రతిష్ఠతోపాటు పార్టీకి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. పైగా... వృద్ధ నేతలకు వీడ్కోలు పలికితే తప్ప తమకు అవకాశం లభించదనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మన్మోహన్ మార్పు విషయం ఎలా ఉన్నా... ప్రస్తుతం తాను రోజువారీ పార్టీ కార్యకలాపాలను నిర్వహించలేనందువల్ల రాహుల్ గాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తే ఎలా ఉంటుందనే విషయంపై సోనియా తర్జన భర్జనలు పడుతున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించి... ప్రజలను, పార్టీ నేతలను, కార్యకర్తలను విరివిగా కలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాలని... అప్పుడు ఆయనకు, పార్టీకి జనాదరణ పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తానికి యువ ఎంపీలు రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటుండగా... సోనియా, మరికొందరు మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu