మనిషి ధర్మం ఎలా ఉండాలో తెలుసా?

మనిషి ఎలా ఉండాలి?? అతడి ధర్మం ఎలా ఉండాలి?? అతడు ఎలా నడుచుకోవాలి?? అనే విషయం గురించి ఓ ఉదాహరణా కథనం ఉంది. 

పూర్వం జపాన్లో కైచూ అనే గొప్ప జెన్ మాస్టర్ క్యోటో ప్రాంతంలో ఒక ఆలయానికి అధిపతిగా ఉంటుండేవాడు. ఒకసారి క్యోటో గవర్నర్ ఆ ఆలయానికి మొదటిసారి వచ్చాడు. జెన్ మాస్టర్ సహాయకుడు, గవర్నర్ గారి విజిటింగ్ కార్డు పట్టుకెళ్ళి మాస్టర్కు ఇచ్చాడు. ఆ కార్డు మీద "కిటగానీ, క్యోటో గవర్నర్" అని ఉంది.

"నాకు ఇతగాడితో ఏమీ పనిలేదు. వెళ్లిపొమ్మను” అన్నాడు కైచూ.

సహాయకుడు గవర్నర్ వద్దకు వచ్చి 'మన్నించండి' అంటూ జరిగిన విషయం చెప్పాడు. 

“పొరపాటు నాదే సుమా” అంటూ గవర్నర్ కలం చేత బుచ్చుకొని, తన పేరు మాత్రమే ఆ కార్డు మీద ఉంచి, 'క్యోటో గవర్నర్' అనే పదాలు కొట్టేసి కార్డును సహాయకుడి చేతుల్లో పెడుతూ “మళ్ళీ ఒకసారి మీ మాస్టర్ వద్దకు వెళ్ళి అడిగిచూడు” అన్నాడు.

అది చూసిన జెన్ మాస్టర్ "ఓహో! వచ్చింది కిటగానీయా? అయితే అతణ్ణి నేను చూడాలనే అనుకుంటున్నాను రమ్మను” అన్నాడు ఈసారి. 

మనిషి తన హోదాతో ఒకటైపోతాడు. పిల్లవాడు పుట్టినప్పటి నుంచీ ఇతడు జీవితంలో ఏమవుతాడో అనే చింత తల్లిదండ్రులకు దాదాపు ఆనాటినుంచే ప్రారంభం అవుతుంది. జాతకచక్రం వేయించి చూస్తారు. గొప్ప కంప్యూటర్ ఇంజనీరో, లేక ఏదో పెద్ద సంస్థకు అధిపతిగా ఉంటాడనో, గొప్ప డాక్టరో, సైంటిస్టో అవుతాడని చెప్పించుకొని సంతోషపడతారు. పిల్లవాడు చేతులు, కాళ్ళు ఆడించి కాస్త పాకే సమయానికల్లా అతడి ముందు ఒక కలమూ, కాస్త ఎడంగా ఒక ఉంగరమూ, అలాంటివే మరేవో అక్కడ పెట్టి ఏది పట్టుకుంటాడో అని వేచి చూస్తుంటారు. అంటే సరస్వతీదేవికి అంకితమవుతాడా లేక లక్ష్మీకటాక్షం అనుభవించనున్నాడా అనే విషయం కనుగొంటారన్నమాట. అయినా కాకపోయినా అప్పటికి అదే పెద్ద సంతృప్తి. ఏవో బంగారు కలలు కంటూ కాలం గడుపుతుంటారు. 

కానీ ఆకాశమంత అవకాశంతో పుట్టిన ఆ శిశువు ఈ కాస్తతోనే సంతృప్తి పడాలా? గొప్ప ఇంజనీర్ కావడంతో అతడి జన్మ సఫలీకృతమైనట్లేనా? ఫలానా కీర్తిగడించిన ఇంజనీర్ మావాడే, నాకొడుకే, మామేనల్లుడే, మాఊరి వాడేనండోయ్ అని చెప్పుకోడానికేనా? జీవితం అంత పరిమితమైనదా? ఈ జీవితానికి అంతకన్నా విస్తృత అవకాశాలు లేవా? సాక్షాత్తూ జీవితాన్నే దర్శించి అంబరమంత ఎత్తు ఎదిగిన మహనీయులు, అంత ఎలా సాధించారు? వారు కూడా ఈ కాస్తతోనే సరిపెట్టుకొని ఉంటే, ఇంతటితోనే సంతృప్తి చెంది ఉంటే, మనిషిగా ఎదిగి ఉండేవారా? 

మరి పిల్లవాడు అలా ఎదగడానికి మనం దోహదం చేసే బదులు, ఇంజనీర్ అవమనో, వృత్తిపరంగా మరేదో సాధించమనో, మనమెందుకు అతడి జీవితాన్ని సంకుచితం చేస్తున్నాం? అంటే మనకీ స్వయంగా అపరిమిత, విశాల జీవితమంటే ఏమిటో సరియైన అవగాహన లేనందువల్లనే కదా? 

జన్మించేటప్పుడు ప్రతిశిశువూ అనంతమైన స్థితిలోనే పుడతాడు. అతడు ఎంతైనా ఎదగగలడు. ఒకప్పుడు రాముడనే దేవుడు, కృష్ణుడనే దేవుడు కూడా ఇలానే తల్లి గర్భాన పుట్టారు. దేవుణ్ణి మీరు నమ్మితే ఈ పిల్లవాడు కూడా ఆ  ''పొటెన్షియాలిటీ' తోనే పుట్టాడు. మనం ఈ పిల్లజీవితాలను సంకుచితపరచకుండా, పరిమితం చేయకుండా స్వేచ్ఛగా  అంటే విచ్చలవిడిగా కాదు, సంతోషంగా, కోమలమైన స్పృహతో ఎదగనిస్తే వీరు కూడా ఆ పురాణపురుషులంతటి వారవుతారేమో? 

'అందరూ అంతంతటి వారెలా అవుతారు?' అనే వేళాకోళం అటువుంచి, అరుణాచల రమణుడూ,  జిడ్డు కృష్ణమూర్తి, అంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారు? వారిని గురించి కూడా తల్లిదండ్రులు అలానే అనుకొని ఉండవచ్చు కదా? “వెర్రి వేషాలు వేయకు. కుదురుగా చదువుకొని పెద్ద ఆఫీసరన్నా అవు, లేదా నీ కర్మ అదేనైతే, ఎక్కడో గుమాస్తాగా నీ బతుకు ఈడ్చెయ్" అని వారి రెక్కలు కత్తిరించేసినట్లయితే ఏమయ్యేది?

అందువల్ల పిల్లవాణ్ణి సాధారణ చదువులు చదివిస్తూ, వాటిలో ప్రావీణ్యత గడిస్తూ ఉన్న సమయంలో కూడా స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. . ఎత్తుకున్నప్పటినుంచి మీ అభిప్రాయాలను గురించి మీరు స్వయంగా ఎరగని మతసిద్ధాంతాలతో అతణ్ణి 'కండీషన్' చేయకూడదు. అతడు కోరుకున్న వృత్తిని స్వీకరించనివ్వాలి. అతడి భవిష్యత్తును మీ అభిమతానుసారంగా మలచడానికి ప్రయత్నించకూడదు. తాను ప్రేమించని వృత్తిని చేపట్టిన సదరు పిల్లవాడు ఆ వృత్తిలో ధనం ఎంతైనా సంపాదించ వచ్చు. తల్లిదండ్రుల్ని తూగుటుయ్యాలలో ఊగించవచ్చు. కానీ అతడికి మాత్రం సంతోషముండదు. అలా దిగులుగా తిరుగుతూనే ఉంటాడు.అంటే ఇష్టం లేని పనిలో డబ్బు వస్తుందేమో కానీ తృప్తి మాత్రం రాదు.

                                 ◆నిశ్శబ్ద.

Related Segment News