నల్ల బెలూన్లతో మోడీకి నిరసన

 

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తమిళనాడులో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ట్విట్టర్‌ వేదికగా గోబ్యాక్‌ మోదీ హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గత నవంబరులో తీవ్ర తుపాను ధాటికి అతలాకుతలమైన తమిళనాడును కేంద్ర ప్రభుత్వ ఆదుకోలేదని వారు సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపించారు. కాగా తాజాగా మధురైలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌కు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎండీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆయన రాగానే గాల్లోకి నల్ల బెలూన్లు వదిలారు. మధురై వీధుల్లో పర్యటిస్తూ మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడు ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తోందని ఆరోపించారు. ప్లక్కార్డులపై తమ డిమాండ్లను రాసి ప్రదర్శించారు. బీజేపీ నేతలు కూడా నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.