బీజేపీ ఒంటెత్తుపోకడకు నిదర్శనం ప్రొటెం స్పీకర్ వివాదం!

కొత్త లోక్‌ సభ సమావేశాల ప్రారంభం రోజునే పాలక, ప్రతిపక్షాల మధ్య  సయోధ్య, సభ సజావుగా సాగే అవకాశాలు లేవని తేలిపోయింది. సమావేశాల ప్రారంభమే ఓ వివాదానికి బీజం పడటంతో 18వ లోక్ సభ సాగే తీరు 17వ లోక్ సభ సాగిన తీరుకు పెద్దగా భిన్నంగా ఉండే అవకాశం లేదని తేటతెల్లమైపోయింది.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొడికున్నిల్‌ సురేశ్‌ను ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించే బదులు బీజేపీకి చెందిన భర్తృహరి మెహతాబ్‌ను ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా సభలో సీనియారిటీ ఉన్న సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించడం ఆనవాయితీ. అయితే బీజేపీ ఆ ఆనవాయితీని పాటించలేదు.  

ప్రస్తుత లోక్ సభలో సురేశ్‌ అత్యంత సీనియారిటీ కలిగిన సభ్యుడు, ఆయన ఎనిమిది సార్లు  లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చి సురేష్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించి ఉంటే బీజేపీ హుందాగా వ్యవహరించిందని భావించడానికి దోహదపడేది. సభ సజావుగా సాగేందుకు అవసరమైన సానుకూల వాతావరణం ఏర్పడి ఉండేది. అలా కాకుండా బీజేపీ మొండి పట్టుదలకు పోయి మొండిపట్టుదలకు పోయి  ఏడు సార్లు లోక్‌ సభ సభ్యుడిగా ఎన్నికైన  భర్తృహరి మెహతాబ్‌ను  ప్రొటెం స్పీకర్ గా నియమించడం ద్వారా.. సభా నిర్వహణ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించబోతున్నదన్నది స్పష్టంగా తేలిపోయింది. పార్టీలతో సంబంధం లేకుండా సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించడం అన్నది సంప్రదాయం. అయితే బీజేపీకి భారత సంస్కృతి సంప్రదాయాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ సంప్రదాయాలను పాటించే విషయంలో పెద్దగా పట్టింపు ఉన్నట్లు కనిపించదు.  

అసలింతకీ ప్రటెం స్పీకర్ బాధ్యతలు, హక్కులు అత్యంత పరిమితం. సభకు ఎంపికైన కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడం, కొత్త స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకూ స్పీకర్ స్థానంలో కూర్చోవడం మాత్రమే. ఇంతోటి దానికి పంతానికి పోయి, పట్టుదలకు పోయి.. సంప్రదాయాన్ని తోసి రాజనడం ద్వారా బీజేపీ తన ఏకపక్ష వైఖరికి, విపక్షాలకు గౌరవం ఇవ్వని ధోరణిని చాటుకుంది.  లోక్‌సభ దీర్ఘకాల అనుభవం ఉన్న వ్యక్తిని ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించాల్సి ఉండగా బీజేపీ అందుకు భిన్నంగా వ్యవహరించడం సముచితం కాదని కాంగ్రెస్ పేర్కొంది.  ఈ నిర్ణయం ద్వారా  మోడీ సర్కార్ వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నది స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.