చరిత్ర చెబుతూ తప్పులో కాలేసిన మోడీ..నెటిజన్ల కామెంట్లు..!

భారత ప్రధాని నరేంద్రమోడీ భారతదేశ చరిత్ర చెబుతూ తప్పులో కాలేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారతీయ సాంస్కృతిక సంపద అప్పగింత సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కోణార్క్ ఆలయం గురించి ప్రస్తావించారు. నేటి ఆధునిక యువతుల్లాగా మినీ స్కర్టులు ధరించిన పర్సులను పట్టుకున్న విగ్రహాలను రెండు వేల సంవత్సరాల క్రితమే మన కళాకారులు చెక్కారని మోడీ వివరించారు.

 

ఇక్కడ ప్రధాని మూడు తప్పులు మాట్లాడారు. కోణార్క్ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితంది కాదు. 13వ శతాబ్ధంలో అంటే 1250 ప్రాంతంలో నిర్మించింది. దానిని నిర్మించి నేటికి 766 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. రెండోది కోణార్క్ ఆలయంపై ఎక్కువగా స్త్రీ, పురుషుల నగ్న లైంగిక విగ్రహాలు ఉంటాయి. కొన్ని స్త్రీ విగ్రహాలకు మాత్రమే నడుముకు నగలు ధరించినట్లుంది. వాటిని ఆధునిక స్కర్టులతో పొల్చలేం. ముచ్చటగా మూడో తప్పు పర్సు గురించి మాట్లాడటం. పూర్తిగా నగ్నంగా ఉన్న స్త్రీ, పురుషుల లైంగిక అవయవాలు కనిపించకుండా అది పర్సులాగా కాకుండా బ్యాగులాంటి ఆకారం అడ్డుగా ఉంటుందంతే. మోడీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. కోణార్క్ ఆలయం అంటే మోడీ, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అనుకున్నట్లున్నారంటూ జోకులేశారు. మోడీ గారు కోణార్క్ ఆలయంపైనున్న విగ్రహాలను పరికించి చూడకపోయి ఉండవచ్చు గానీ, ఆయనకు మాటలు అందించిన అధికారులకు చరిత్ర తెలియదేమో అంటూ మరోకరు ట్వీట్ చేశారు. ఏదైమైనా మీరు ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి గురూజీ అంటూ ఇంకోకరు ట్వీట్ చేశారు.