హాలీవుడ్ , బాలీవుడ్‌ను దెబ్బతీస్తోందా..?

హాలీవుడ్ సినిమాలనుద్దేశించి బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌బి అమితాబ్ చేసిన వ్యాఖ్యలు భారతీయ చిత్ర పరిశ్రమలో అలజడి రేపాయి. నిన్న ఆయన మాట్లాడుతూ హాలీవుడ్ సినిమాల దెబ్బకు భారతీయ సినిమాలు నష్టపోతున్నాయి. మనదేశం మాత్రమే కాదు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి చిత్రపరిశ్రమలపైనా హాలీవుడ్ తీవ్ర ప్రభావం చూపుతోందని..ఈ ప్రమాదం నుంచి మన చిత్రపరిశ్రమను కాపాడుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అమెరికాలో జరిగిన ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పారు. నిజంగానే హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు భారతీయ సినిమాను నాశనం చేసేంత శక్తి ఉందా..? అంటే కొంతవరకు నిజమని ఒప్పుకోవాలి.

 

పెరిగిన సాంకేతికత, ప్రజల జీవన ప్రమాణస్ధాయి, అభిరుచుల్లో మార్పు రావడంతో మనవాళ్లకి సినిమాల పట్ల అవగాహన పెరిగింది. దానికి తోడు అతిపెద్ద దేశం కావడంతో భారతీయ మార్కెట్ స్థాయి విస్తృతమైనది. దీనిని గుర్తించిన హాలీవుడ్ దర్శక, నిర్మాతలు సినిమాలను డబ్బింగ్ రూపంలో విడుదల చేయడం మొదలెట్టారు. కొన్ని సార్లు ఇతర దేశాల కంటే ముందుగానే మనదేశంలోని ప్రాంతీయ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం భారతీయ నటులను సినిమాలకు ఎంచుకోవడం, వారితో డబ్బింగ్ చెప్పించడం లాంటి వ్యూహాలను అమలు జరుపుతున్నారు. దీనికి తోడు కోట్ల రూపాయలకు వెనుకాడకుండా పబ్లిసిటీ చేస్తున్నారు. దీంతో భారతీయ చిత్రాలకు ధీటుగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి హాలీవుడ్ చిత్రాలు వసూళ్లు రాబడుతున్నాయి. దానికి నిదర్శనంగా అవతార్, టైటానిక్, మమ్మీ, ద జంగిల్ బుక్, డెడ్‌ఫూల్, బ్యాట్‌మేన్ వర్సెస్ సూపర్‌మెన్ లాంటి చిత్రాలు భారతీయ అగ్రకథానాయకులు నటించిన చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టాయి.

 

దీనికి కారణం మన స్వయంకృతమే.. భారతీయ సినిమా భారీ తనాన్ని సంతరించుకుంది కానీ తన మూస ధోరణిని వదల్లేకపోతోంది. రెండు ఫైట్లు, నాలుగు పాటలు, కాస్త కామెడీ.. సగటు భారతీయ సినిమా రూపమిదే. ఇలాంటి వాటిని చూసి చూసి జనానికి వెగటు పుట్టింది. పాత తరం వారు వినోదం కోసం వాటిని ఆదరించినా నేటి తరం..చదువుకున్నది, తెలివైనది కావడంతో మన సినిమాను ఆదరించడం లేదు. సహాజంగా కొత్తదనం కోరుకున్న నేటి తరం హాలీవుడ్ సినిమాల వైపు మళ్లీంది. సృజన, ఖర్చు, నాణ్యత, నవ్యత వంటి విషయాల్లో మన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉండవు.

 

వైవిధ్యమైన సబ్జెక్ట్‌లను టచ్ చేయడంలో మనోళ్లు గొప్ప స్థాయిలో ఉన్నారా? అంటే అదీ లేదాయె..! ఈ విషయంలోనూ ఇండియన్ సినిమాకు మైనస్ మార్కులే..! ఇన్ని లోపాలు ఉండటాన్ని గమనించిన హాలీవుడ్ ప్రముఖులు భారతీయ సినిమాపై రీసెర్చ్ చేసి ఏం చేస్తే భారతీయులకు నచ్చుతుందో కనిపెట్టారు. అందుకు తగ్గట్టుగా సినిమాలు రూపొందించి మన మీదకు వదులుతున్నారు, బాక్సాఫీసులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా మన దర్శక, నిర్మాతలు మేల్కోకుంటే భారతీయ సినిమా ఆటుపోట్లను ఎదుర్కోక తప్పదు..అమితాబ్ మాటలు నిజం కాక తప్పదు.