తీరని కడుపుకోతకు రెండేళ్లు...

మృత్యువు నీటి రూపంలో కబళించిన రోజు..విహారయాత్ర విషాదయాత్రగా మారిన రోజు.. ఉన్నత చదువుతో భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్న విద్యార్థుల కలలన్ని కల్లలైన రోజు..ఆ రోజుకి ఇవాళ్టీతో రెండేళ్లు. అదే బియాస్ నది దుర్ఘటన. హైదరాబాద్ వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు 2014 జూన్ 1వ తేదీన స్టడీటూర్‌కు వెళ్లారు. 8వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది సందర్శనకు వెళ్లి లార్జీ డ్యామ్ వద్ద నదిలోకి దిగారు. నదిలో నీరు లేకపోవడంతో ప్రకృతి అందాలను చూస్తూ..తోటి వారిని ఆటపట్టిస్తూ..ఫోటోలు దిగుతున్నారు. పెద్ద బండరాయిపై నిలబడి ఫోజులిస్తున్నారు. అప్పుడు సూర్యుడు పశ్చిమాన వాలి చీకటి పడుతోంది. అప్పటి వరకు లేని నీరు నదిలోకి వస్తోంది. కేరింతలతో ఉన్న విద్యార్థులు నీటి శబ్ధాన్ని గమనించలేకపోయారు.

 

చూస్తుండగానే ప్రవాహం ఉధృతమైంది..ఆ వేగానికి ఒక్కొక్కరు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయారు. 24 మంది జలసమాధి అయ్యారు. అత్యాధునిక పరికరాలతో రెండు వారాల పాటు శ్రమిస్తే గానీ మృతదేహాలు లభించలేదు. మానవతప్పిదం వల్లే బియాస్ దుర్ఘటన జరిగింది. నీళ్లను కిందకు వదిలే ముందు నలుగురు సిబ్బంది నది మొత్తం పర్యవేక్షించాలి. ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదలడానికి వీళ్లు లేదు. గేట్లు ఎత్తినవారిది, పరిసరాలను గమనించని కళాశాల నిర్వాహకులది ఇద్దరిది తప్పే.

 

ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జరిగిన ప్రమాదానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం, డ్యాం విద్యుత్ బోర్డు, వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని న్యాయస్థానం తీర్పు చెప్పింది. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, దీనిలో 60 శాతం హిమాచల్‌ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యామ్ బోర్డు..10 శాతం హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం..మరో 30 శాతం కళశాల యాజమాన్యం భరించాలని ఆదేశించింది. ఎంత నష్టపరిహారం చెల్లించినా బిడ్డలను పొగొట్టుకున్న తల్లిదండ్రుల కడుపు శకోం తీరదు. పుస్తకాలు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కాలేజీకి వెళ్లే ఏ పిల్లాడిని చూసినా తమ బిడ్డేనేమోనని బావురుమంటున్నారు. ఇది తీరని వేదన..వీరంతా కోరుకునేది ఒక్కటే ఇలాంటి కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకూడదు..దేశంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటన జరగకూడదన్నదే వీరి ఆకాంక్ష.