అప్సర హత్య కేసులో పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు 

హైద్రాబాద్ సరూర్ నగర్ కు చెందిన  అప్సర అనే యువతిని 2023 జూన్ 3న హత్య చేసిన పూజారీ సాయికృష్ణకు రంగా రెడ్డి  కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ప్రతీ రోజు అప్సర అనే యువతి ఆలయానికి వచ్చేది. ఈ  నేపథ్యంలో పూజారీతో పరిచయం ప్రేమకు దారితీసింది. పూజారి సాయి కృష్ణకు అప్పటికే పెళ్లయి పిల్లలు  ఉన్నారు. అప్సరకు  కూడా అ ప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయింది. సినిమాల్లో నటించాలన్న కోరికతో   అప్సర తమిళనాడు నుంచి హైద్రాబాద్ చేరుకుంది. అప్సరతో  అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఓకే చెప్పిన  పూజారి పెళ్లి చేసుకోవడానికి  మాత్రం నిరాకరించాడు.  ప్రతీరోజు అప్స‌ర  పూజారి సాయికృష్ణ ను  పెళ్లి చేసుకోవాలని వేధించేది.  ఎలాగో అలా  అప్సరను వదిలించుకోవాలనుకున్న  పూజారీ పథకం ప్రకారం తమిళనాడు కోయంబత్తూరు తీసుకెళతానని మాయమాటలు చెప్పాడు. తన కారులోనే  శంషాబాద్ మండలంలోని సుల్తాన్ పల్లిలోని ఓ గో శాలకు తీసుకెళ్లాడు. సిసి కెమెరాలు లేవని నిర్ధారించుకుని అప్సరను హత్య చేశాడు. ముఖంపై ప్లాస్టిక్ కవర్ తో కప్పి అత్యంత పాశవికంగా పూజారి అప్సరను హత్య చేశాడు. తాను చేసిన నేరాన్ని పూజారి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. బలమైన సాక్ష్యాలతో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేశారు.  రంగా రెడ్డి కోర్టులో ట్రయల్ ముగియడంతో  బుధవారం తీర్పు వెలువడింది. పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.