రాష్ట్రపతి తనయుడిపై ప్రశంసల జల్లు..
posted on Nov 23, 2015 4:05PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు పార్లమెంట్ సభ్యుడు అభిజిత్ ముఖర్జీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతలా అభిజిత్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించడానికి అతను ఏం చేశాడనా.. ప్రమాదంలో ఉన్న ఓ మహిళ ప్రాణాలు కాపాడటంలో కృషి చేసినందుకు గాను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. సుమితాపాల్ అనే మహిళ తన కుమారుడు ఆర్యతో కలిసి బైక్ లో బురద్వాన్ నుంచి గస్కరాలోని ఓఆలయంలో పూజలు చెయ్యడానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పడంతో సుమితాపాల్ కిందపడిపోయారు. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలైనాయి. అయితే అది నిర్జనప్రదేశం కావడంతో సుమితాపాల్ కుమారుడు ఆర్య సైతం ఏమి చెయ్యలేని పరిస్థితిలో అలా ఉండిపోయారు. అయితే అదే సమయానికి అభిజిత్ ముఖర్జీ అటు వైపు వెళుతుండటంతో వారిని గుర్తించి.. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకొని.. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను బురద్వాన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించలాని అక్కడి వైద్యులు సూచించారు. అంతే అభిజిత్ ముఖర్జీ చేసిన పనికి ఇప్పుడు అందరూ తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.