టీడీపీ లోకి ఆనం బ్రదర్స్..?
posted on Nov 23, 2015 3:31PM

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండీ ఎంతో మంది నాయకులు వేరే పార్టీలకు జంప్ అయ్యారు. అందరూ ఒక ఎత్తైతే ఇప్పుడు ఆనం బ్రదర్స్ (ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి) పార్టీని వీడటం అన్నది ఒక ఎత్తు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఉన్న వీరిద్దరూ రాజకీయాల్లో క్రియా శీలకమైన పాత్ర పోషించారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుల్లా ఉన్న ఆనం బ్రదర్స్ ఇప్పుడు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అందరిలాగే వీరిద్దరి ఎంట్రీకి చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా.. కొంతమంది టీడీపీ నేతలు వీరి రాకకు అభ్యంతరం చెపుతున్నా చంద్రబాబు మాత్రం వారిని బుజ్జగించి ఆనం బ్రదర్స్ ని పార్టీలోకి తీసుకురావడాని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఓవారం, పది రోజుల్లో ఆనం బ్రదర్స్ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి జిల్లా రాజకీయాల్లో ఓ చక్రం తిప్పిన ఆనం బ్రదర్స్ కి ఇప్పుడు టీడీపీలోకి చేరితే ఎలాంటి పదవులు దక్కుతాయి అన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. మరి చంద్రబాబు వారికి ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి.