సామాన్యులతో "సామాన్యుడి"గా ఒబామా..!
posted on May 24, 2016 2:32PM

అమెరికా అధ్యక్షుడు..ఈ పేరుకు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. కనుసైగతో ప్రపంచాన్ని శాసించగల శక్తివంతుడు. ఆయనతో కరచాలనం కోసం దేశాధినేతలు ఎదురుచూస్తుంటారు. అలాంటి వ్యక్తి వస్తున్నారంటే ఆ హంగామా మామూలుగా ఉండదు. భూమి, ఆకాశం అన్ని వైపులా పటిష్ట భద్రత చర్యలు ఆయనను కాపు కాస్తుంటాయి. అలాంటి వ్యక్తి సామాన్యుడిలా రోడ్డు పక్కన కాకా హోటల్‌లో టిఫిన్ చేస్తే. నమ్మ బుద్ది కావడం లేదా..? కాని ఇది నిజం.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసియా పర్యటనలో భాగంగా వియత్నాం వెళ్లిన ఆయన అక్కడ సాధారణ వ్యక్తిలాగా చిన్న రెస్టారెంట్‌కు వెళ్లి ఓ ప్లాస్టిక్ స్టూల్‌పై కూర్చుని డిన్నర్ చేశారు.
.jpg)
అయితే ఇలా చేయడానికి కారణముంది. సీఎన్ఎన్ ప్రతినిధి అంథోనీ బౌర్డియాన్ పార్ట్స్ అన్‌నోన్ అనే షో కోసం ఒబామాని ఇంటర్వ్యూ చేశారు. దీని కోసమే నిరాడంబరంగా రెస్టారెంట్‌కు వచ్చారు ఒబామా బౌర్డియాన్ అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే అక్కడ ఒబామా ఉన్నారన్న ఆలోచన లేకుండా మిగిలిన కస్టమర్లు తమ పని తాము చేసుకునిపోయారు. కాసేపటికి రెస్టారెంట్‌కు సమీపంలోకి వంద పోలీస్ కార్లు, సాయుధ బలగాలు దిగడం రెస్టారెంట్‌ను చుట్టుముట్టడం జరిగిపోయింది. దీంతో అక్కడున్న ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కస్టమర్లలోంచి సీఎన్ఎన్ ప్రతినిధితో పాటు ఒబామా లేచి రావడం చూసి ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది . అంతే ఆయనని తమ ఫోన్‌లలో బంధించేందుకు జనం ఎగబడ్డారు. ఒబామా అక్కడ వియత్నాం సంప్రదాయ నూడుల్స్, సూప్, హానోయి బీర్ తీసుకున్నారని సీఎన్ఎన్ ప్రతినిధి చెప్పారు. ఇక్కడ భోజనం చేసినందుకు ఆయనకు కేవలం ఆరు డాలర్లే అయ్యిందట.