అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ ఇండియాలో పూజలు

మొత్తం ప్ర‌పంచ‌ం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ మంగళవారం (నవంబర్4) పోలింగ్  జ‌ర‌గ‌నుంది.  అగ్ర‌రాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓట‌ర్లలో ముంద‌స్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల‌ మంది త‌మ ఓటు హ‌క్కు ఇప్పటికే వినియోగించేసుకున్నారు. ఇక చివ‌రి వ‌ర‌కు ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌, క‌మ‌లా హారిస్ ల ప్రచారానికి సోమవారం(నవంబర్ 3)తో ముగుస్తుంది.

ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నిర్వహించిన పలు సర్వేలు.. గెలుపు ఎవరిదన్నది ఇతమిథ్ధంగా తేల్చలేకపోయాయి కానీ పోరు హోరాహోరీగా ఉంటుందన్న స్పష్టత ఇచ్చాయి.  ఇవాళ రాత్రితో వారి ప్ర‌చారం ముగియ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన స‌ర్వేల‌ను బ‌ట్టి ఇరువురి మ‌ధ్య హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని తేలింది. మరీ ముఖ్యంగా ఎన్నికలలో  స్వింగ్ స్టేట్స్‌లో కమలాహారిస్, ట్రంప్ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి.  ఈ రాష్ట్రాల్లో అక్టోబ‌ర్ 24 నుంచి న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు ది న్యూయార్క్ టైమ్స్‌- స‌ర్వే నిర్వ‌హిం చింది. ఇందులో విస్కాన్సిన్‌, నార్త్ క‌రోలినా, నెవెడాలో క‌మ‌లకు మ‌ద్ద‌తు ఉంటే.. అరిజోనాలో ట్రంప్‌ వైపు ఓట్ల‌రు మొగ్గ‌చూపుతున్న‌ట్లు తేలింది.  అలాగే పెన్సిల్వేయా, జార్జియా, మిషిగ‌న్‌లో ఇరువురు అభ్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర పోటీ ఉన్న‌ట్లు దిన్యూయార్క్ టైమ్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. 

ఇలా ఉండగా అమెరికా ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ ఇండియాలో పూజలు జరుగుతున్నాయి. ఇందులో వింతేమీ లేదు. కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో భారత్ లో ఆమె విజయాన్ని కోరుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడులోని తులసేంద్రపురం అనే గ్రామంలో కమలా హారిస్ విజయం కోసం పూజలు నిర్వహించడమే కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఇక్కడి ప్రజలు కూడా ఓట్లు వేస్తున్నారా అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచార సంరంభం కనిపిస్తోంది. గ్రామం అంతటా కమలా హారిస్ కు మద్దతుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి.  

అందుకు కారణం లేకపోలేదు. కమలా హారిస్ తల్లి డాక్టర్ శ్యామల స్వగ్రామం తులసేంద్ర పురం. ఆ ఊరి జనం కమలాహారిస్ ను తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆమెరికాలో పుట్టిపెరిగినా కమలా హారిస్ తన అమ్మమ్మ గారి ఊరైన తులసేంద్రపురం గ్రామానికి పలుమార్లు వచ్చి వెళ్లారు. అలా ఆ గ్రామస్తులకు కమలాహారిస్ పట్ల అభిమానం ఏర్పడింది.  దీంతో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ వారు పూజలు చేస్తున్నారు. గ్రామం అంతటా ఆమె పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి హంగామా చేస్తున్నారు. ఎన్నికలలో ఆమె విజయం సాధిస్తే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి సమాయత్తం అవుతున్నారు.