విజయసాయి రెడ్డి అధికారాలకు కత్తెర!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..  వైయస్ జగన్ హార్ట్ కోర్ ఫ్యాన్ అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు దూరం పెట్టారు? ఎందుకంటే.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేస్తున్న పాదయాత్రలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. అలా వచ్చిన రైతులను.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఔను జగన్ ఆయనను దూరం పెట్టడానికి అదే ఏకైక కారణం. ఈ సంగతి స్వయంగా   ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

సరే ఆ తరువాత జరిగిన పరిణామాలతో  కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు కోటం రెడ్డికి వచ్చిన పరిస్థితే వైసీపీ కీలక నేత విజయసాయికి వచ్చింది. విజయసాయినీ జగన్ దూరం పెట్టారని పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయనను జగన్ ఎందుకు దూరం పెట్టారు అన్న ప్రశ్నకు  ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విజయసాయి అక్కడకు వెళ్లి పరామర్శించడం,  ఆయన మరణించిన తరువాత ఆయన అంత్యక్రియల వరకు నందమూరి, నారా ఫ్యామిలీలు ఎలా అయితే అంత్యక్రియల ఏర్పట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారో..  విజయసాయిరెడ్డి కూడా చేశారు. ఎందుకంటే.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డి భార్యకు సొంత చెల్లెలి కుమార్తె కావడంతో ఆ బంధుత్వంతో విజయసాయి కూడా అక్కడే ఉండి అన్ని విషయాలూ దగ్గరుండి చూసుకున్నారు.  

బెంగళూరు నుంచి తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తీసుకు వచ్చిన నాటి నుంచి విజయసాయిరెడ్డి అక్కడే ఉండి.. తారకరత్నకు నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను   విజయసాయిరెడ్డి పలకరించి.. వారి పక్కనే కూర్చొని కొద్ది సేపు   ముచ్చటించారు.  అయితే ఈ వ్యవహారాన్ని ఎవరూ పొలిటికల్ గా చూడలేదు. ఒక విషాద సమయంలో బంధువు కుటుంబానికి విజయసాయి అండగా నిలుచున్నారనే భావించారు. అయితే  విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని అధికార వైసీపీ అధినేత జగన్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తనను ధిక్కరించడంగానే భావించారు.  

ఎందుకంటే.. వైసీపీ  అధిష్టానం  రాజకీయ ప్రత్యర్ధులు అంటే వ్యక్తిగత శత్రువులుగానే భావిస్తుంది.  ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకు తార్కానమే.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్.. అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు  వైసీపీ నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా ప్రకటించింది. అందులో యువత, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, ట్రేడ్ యూనియన్, వాణిజ్యం, సాంస్కృతిక, పబ్లిసిటీ, నేత కార్మికులు, వైద్యులు, ఐటీ, వికలాంగులు, సేవాదళ్,  గ్రీవెన్స్ సెల్‌తోపాటు వివిధ విభాగాల అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఇలా అన్ని జిల్లా స్థాయి పార్టీ అనుబంధ విభాగాల నియామకంపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్తగా పేర్కొంది. అది ఇప్పుడు అసలు సిసలు చర్చకు.. అదే వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెట్టారన్న చర్చకు తెరలేపింది. 

ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. అదీకాక విజయసాయిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు.  అటువంటి విజయసాయిని పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించేసింది. విజయసాయికి కో ఇన్ చార్జ్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆ స్థానంలో నియమించారు.    విజయసాయిరెడ్డి వ్యవహారశైలి గత కొన్ని రోజులుగా మారింది ఈ విషయాన్ని  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజే కనిపెట్టారంటే..  పార్టీ అధిష్టానం కనిపెట్టలేదా? ఇంతకీ ఆ మార్పు ఏమిటంటే  విజయసాయిరెడ్డి తన ట్వీట్లలో హీట్ ను పూర్తిగా తగ్గించేశారు. సంసారపక్షంగా, హుందాగా ఆయన ట్వీట్లు ఇటీవలి కాలంలో ఉంటున్నాయి. అదే గతంలో అయితే విజయసాయి  చంద్రబాబు, లోకేష్ పై.. ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడే వారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.  అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పెద్దలతోనే కాదు.. అక్కడి అధికార కేంద్రాలతో సైతం ఆయన చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటారు. అందుకే ఆయనకు రాజ్యసభకు ప్యానెల్ ఛైర్మన్ పదవి  దక్కింది.. అలాగే తాజాగా సంసద్ రత్న అవార్డు కూడా వచ్చింది. దీంతోనే వైసీపీ అధిష్టానానికి ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని చెబుతున్నారు. 

ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. విజయసాయిరెడ్డిని జగన్ ఇక పక్కన పెట్టేసినట్లేనని అంటున్నారు.  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయనకు ఉద్వాసన పలికినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu