శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!
posted on Feb 25, 2023 9:40AM
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ మాట కొస్తే, దేశ రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కున్న స్థానం ప్రత్యేకం. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడంలో ప్రస్తుతానికి మోదీ, షా జోడీది పై చేయి అయితే కావచ్చు కానీ, అ విషయంలో శరద్ పవార్ ఆ ఇద్దిరికీ ఏ మాత్రం తీసిపోరు. నిజం చెప్పాలంటే వారికంటే పవార్ రెండాకులు ఎక్కువే చదివారు. 2019లో మహారాష్ట్ర బీజేపీ, శివసేన కూటమిలో తలెత్తిన సంక్షోభం ప్రభుత్వం ఏర్పాటుకు అవరోధంగా మారిన సమయంలో, ఆ ఇద్దరినీ సైతం శరద్ పవార్ బురిడీ కొట్టించారని అంటారు.
ఇక విషయంలోకి వెళితే, 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో,బీజేపీ,శివసేన కూటమిని ప్రజలు గెలిపించారు. మెజారిటీ కట్ట బెట్టారు. కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు తలెత్తడంతో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాలేదు. ఈ నేపద్యంలో మరో గత్యంతరం లేకనో. లేక రాజకీయ ఎత్తుగడలో భాగంగానో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి సిఫార్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.
ఇంతవరకు అంతా శాస్త్రోక్తంగానే జరిగింది కానీ, ఆ తర్వాత సీన్ మారింది. శివ సేన దారికి వచ్చే వరకు రాష్ట్రపతి పాలన కొనసాగించాలన్న బీజేపీ అగ్ర నేతల ఎత్తుగడలను ముందుగానే పవార్ పసిగట్టారు. (నిజానికి రాష్ట్రపతి పాలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వమే అయినా, కేంద్ర ప్రభుత్వం అ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని సృష్టించింది మాత్రం శరద్ పవార్ అంటారు) అంతే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగామూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమికి పురుడు పోశారు. ఆ తర్వాత దానికి మహా వికాస్ అఘాడీ (ఏమ్వీఎ) గా నామకరణం చేశారు. సరే అదంతా వేరే కథ.
ఇక శరద్ పవార్ చాణక్యం విషయానికి వద్దాం.శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అఘాడీ ప్రభుత్వం ఏర్పడాలంటే, ముందు రాష్ట్రపతి పాలన అడ్డుగా నిలిచింది. అందుకోసం పవార్, పథకం రచించారు. మాములుగా అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన అంత తేలిగ్గా ఎత్తివేయదు. ఆ విషయం పవార్ కు బాగా తెలుసు. అందుకే పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ ద్వారా బీజేపీతో రాయబేరాలు నడిపారు. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం తెల్లారేసరికి బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే, దేశ రాజకీయాల్లో మహాశ్చర్యాలలో ఒకటిగా నిలిచిన బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం కేవలం మూడంటే మూడు రోజులలో పతనమైంది. ఆ తర్వాత, ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదంతా ఇప్పడు చరిత్ర.
అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫండవిస్ 2019లో అజిత్ పవర్ తో కలిసి తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనక శరద్ పవార్ మద్దతు ఉందని చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పడు దుమారం రేపుతున్నాయి. గత వారం రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో, ‘అప్పుడేం జరిగింది?’ అనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఈ నేపధ్యంలో శరద పవార్ అసలు గుట్టు విప్పారు. అయితే అసలు విషయం చెప్పకుండా అప్పడు అలా రాత్రికి రాత్రి ప్రభుత్వం ఏర్పాటు జరగకపోయి ఉంటే రాష్ట్రపతి పాలన సుదీర్ఘంగా కొనసాగేదని మాత్రమే పేర్కొన్నారు. ఆయన అంత ముక్తసరిగా చెప్పిన ఆ ఒక్క మాటే.. 2019 మూడునాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు ఆయన ఎత్తుగడలో భాగమేనన్న వాస్తవాన్ని బయటపెట్టేసింది. అందుకే ఆయన పవార్ అయ్యారు. రాజకీయ ఎత్తులు , జిత్తులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎందుకంటారో మరో సారి రుజువైంది. దటీజ్ పవార్!