పేదరికం ఉంటే జీవితంలో ఎదగలేమనే నిరాశతో ఉన్నారా..
posted on Sep 30, 2023 12:37PM
అంగవైకల్యం ఉన్నా అనుకున్నది సాధించగలమేమో కానీ, ఆలోచనలకు వైకల్యం వస్తే దేన్నీ సాధించలేం. కాబట్టి పేదరికం ఒక శాపమని ఊహించుకొని శిలలా మారిపోవడం కన్నా, అదీ ఒక వరమేనని భావించి చైతన్యవంతంగా మారడం ధీరుని లక్షణం. నిజానికి పేదరికం శాపం కాదు. అది కార్యసిద్ధికి సహకరించే ఒక సాధనం.
జీవితంలో మహోన్నత స్థితికి ఎదిగిన మహాత్ముల్లో ఎంతోమంది పేదరికపు కడలిని దాటినవారేనన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఉదాహరణకు గణిత శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి విదేశీయుల్ని సైతం అబ్బురపరిచిన యువకుడు శ్రీనివాస రామానుజం; బాల్యంలో వార్తాపత్రికల్నీ, కిరాణా సామాగ్రినీ అమ్ముతూ చదువు కొనసాగించి గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచిన 'భారతరత్న' అబ్దుల్ కలామ్ - ఆ పేదరికపు కొలనులో వికసించిన కుసుమాలే. అలాగే అబ్రహామ్ లింకన్, టంగుటూరి ప్రకాశం, కందుకూరి వీరేశలింగం, డాక్టర్ అంబేద్కర్ మొదలైన వారు కూడా పేదరికాన్ని ప్రగతికి సోపానంగా మలచుకొని విజయాలను సాధించినవారే. success, not as a reason for failure. The full scope of our ability and ingenuity is usually only called forth by problems. - R.J. Heathorn
'కష్టాలు మనలోని అంతర్గత శక్తిని వ్యక్తపరిచేందుకు తోడ్పడేవే కానీ అపజయాలకు గురిచేసేవి కావు' అని సానుకూల దృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగిపోవడమే సరైన మార్గం.
మనస్సుంటే మార్గాలెన్నో! కాబట్టి ముందు మన మనస్సుకు నిరాశ అనే అంటువ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి. స్వామి వివేకానంద ఇచ్చిన ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే ధైర్యంగా ముందుకు సాగడానికి తగినంత ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
Fire and enthusiasm must be in our blood... Think not that you are poor, that you have no friends. Ay. who ever saw money make the man? It is man that always makes money. - Swami Vivekananda
పేదరికం వల్ల పస్తులుంటున్న కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడడం కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఏ చిన్న పనైనా చేస్తూ డబ్బు సంపాదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చు. అలా పనిచేస్తూనే యువత చదువు కూడా కొనసాగించవచ్చు. చదివే పిల్లలు డబ్బు సంపాదించకూడదు అనే నియమం ఎక్కడా లేదు. పైన చెప్పుకున్న గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని శ్రమిస్తే అప్పుడు శారీరక లోపం అయినా, పేదరికం అయినా శాపం కాదనీ, అది మీలో ఉన్న నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ నిరూపించడానికి ఒక అవకాశమనీ అర్థమవుతుంది. అలాంటివారు జీవితంలో తప్పకుండా విజేతలు అవుతారు.
*నిశ్శబ్ద.