శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..
posted on Sep 29, 2023 3:41PM
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి , భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు. ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు. జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు.
ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి.
మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది. కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు.
గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు. ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి.
కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు.
శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.
*నిశ్శబ్ద.