భారతి కోసం జువారీ, దాల్మియాలకు చెక్?.. కడపలో సిమెంట్ మంట!
posted on Feb 2, 2022 3:19PM
కొత్త పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంది. మరి, ఒక్కఛాన్స్ అంటూ అందలమెక్కిన జగనన్న ఏం చేస్తున్నారు? ఏపీలో ఉన్న పరిశ్రమలను తరిమేస్తున్నారు..అంటున్నారు. కాలుష్యం పేరుతో చిత్తూరు జిల్లాలో అమరరాజా బ్యాటరీస్‌ను మూసేయించేందుకు గట్టిగానే ప్రయత్నించింది. ఆ మధ్య రిలయన్స్ కంపెనీ తమకిచ్చిన భూములను వెనక్కి ఇచ్చేసి మరీ తిరుపతి నుంచి వెళ్లిపోయింది. విశాఖ నుంచి తట్టాబుట్టా సర్దుకున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. కియా కార్ల కంపెనీని బెదిరించిన ఘనులు ఈ వైసీపీ పాలకులు. అదలా ఉంచితే.. తాజాగా కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీని టార్గెట్ చేశారంటున్నారు. గతంలోనే కడపలో జువారీ సిమెంట్ కంపెనీని కార్నర్ చేయగా.. లేటెస్ట్‌గా దాల్మియా వంతు. ఇదంతా ఎందుకోసమంటే.. భారతి కోసమేనంటూ గుసగుసలు.
ఏపీ ప్రభుత్వం తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ కొత్తగా రాష్ట్రానికి ఒక్క కంపెనీ తీసుకురాకపోయినా.. ఉన్నవి మాత్రం మూతేస్తున్నారు. కాలుష్యం పేరుతో అప్పటికప్పుడు పరిశ్రమల్ని మూసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇదే తరహా ఆదేశాలిచ్చారు. స్పందన కార్యక్రమంలో ఆ పరిశ్రమ వల్ల కాలుష్యం వస్తోందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారని వెంటనే క్లోజర్ ఆదేశాలిచ్చారు. ఇదేం పద్దతి కాదని.. ప్రభుత్వం ఏదో ఉద్దేశంతో ఇలా చేస్తోందని దాల్మియా సిమెంట్ హైకోర్టులో పిటిషన్ వేసి.. అప్పటికప్పుడు కార్యకలాపాలు కొనసాగించుకునే అవకాశం తెచ్చుకుంది. కానీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.
కడపలో ఓ సిమెంట్ పరిశ్రమకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది ఏప్రిల్‌లో జువారీ సిమెంట్స్ పరిశ్రమను ప్రభుత్వం మూసి వేయించింది. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం తాము అన్ని రకాల కాలుష్య నియంత్రణ పద్దతులు పాటిస్తున్నామని వాదించినా పట్టించుకోలేదు. చివరికి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. అదే కడపలో సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ వల్ల జరిగే కాలుష్యంపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. అయితే భారతిని కాకుండా.. ఇతర సిమెంట్ ఫ్యాక్టరీలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో..? భారతి సిమెంట్స్ కోసమే ఇలా మిగతా వాటికి చెక్ పెడుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని దెబ్బకొట్టేందుకు అమరరాజా బ్యాటరీస్‌ను పొల్యూషన్ పేరుతో భయభ్రాంతులకు గురి చేయగా.. ఇక, సొంత కంపెనీ కోసం ఇతర సిమెంట్ ఫ్యాక్టరీలకు చెక్ పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి, ఒక్కో కంపెనీని మూసేసుకుంటూ పోతే.. అభివృద్ధి, ఆదాయం, ఉద్యోగాలు ఎలా జగనన్నా? అంటూ నిలదీస్తున్నారు నిరుద్యోగులు.