బంగాళాఖాతంలో కలపాలనుకుంటున్న కేసీఆర్ ప్లాన్ ఔట్
posted on Feb 2, 2022 3:05PM
ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేదే రహస్యం. మూడో వ్యక్తి చెవిలో గనక పడితే దాన్ని రహస్యం కాదు.. "బహస్యం" అనుకోవాల్సి ఉంటుంది. అంటే బహిరంగ రహస్యం అన్నమాట. కేంద్ర బడ్జెట్ లో బొక్కలు (కన్నాలు) వెదికి ప్రజల ముందుంచే క్రమంలో కేసీఆర్ తన దగ్గరున్న బొక్కలేంటో లీకవుట్ చేసేశారు. తన మీద తనకు, తన మాట మీద తనకు కంట్రోల్ తప్పి మాట్లాడడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. బడ్జెట్ మీద తెలంగాణకే గాక, యావద్దేశ ప్రజలకు కూడా ఏమీ దక్కలేదంటూ గాండ్రించిన కేసీఆర్... ఇక లాభం లేదు.. అసలు మోడీ సర్కారునే ఇంటికి పంపాలని తీవ్రమైన అసహనం వెళ్లగక్కారు. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తానని, అందుకోసం తానే సిపాయినవుతానని వీరుడి లెవెల్లో వాగాడంబరం ప్రదర్శించారు.
వాస్తవానికి ఒక మంచి ప్రొఫెషనల్ పొలిటీషియన్ తాను చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా మంచి భాషను ఉపయోగించి ప్రెస్సుకు వివరిస్తారు. అసలు ప్రెస్సు అంటేనే ప్రజలు. ప్రజలకు వివరించేందుకే ప్రెస్సు ఉన్నది కాబట్టి ప్రెస్సును ప్రజలుగానే భావిస్తారు. అయితే కేసీఆర్ తాను 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు మాట్లాడుతున్నానన్న స్పృహలో ఉన్నారో లేక కేవలం ఓ పది మంది జర్నలిస్టులతో చిట్ చాట్ అనుకున్నారో తెలీదు. రెండున్నర గంటల టైం... అంటే ఓ పెద్దసినిమా చూసినంత టైం అన్నమాట. ఇంత టైంలో నిజంగా కేసీఆర్ కూడా ఓ సినిమానే చూపించారు. ప్రగతిభవన్ లో ఏం జరుగుతుందో, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో, ఎవరెవరి స్పందనలేంటో, భవిష్యత్తులో తానేం చేయాలనుకుంటున్నారో అంతా పూస గుచ్చినట్లు చెప్పుకున్నారు. ఇక్కడే తన లోగుట్టును కేసీఆరే లీక్ చేసుకున్నారంటున్నారు రాజకీయ నిపుణులు. బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరుగుతుందో, మోడీ అండ్ టీమ్ కు వ్యతిరేకంగా తానేం చేయబోతున్నాడో ప్రెస్ మీట్ వేదికగా భారీ ప్రోమోనే రిలీజ్ చేశారు.
తెలియక చేసినా, కావాలని చేసినా... కేసీఆర్ లీక్ చేసిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
1) బీజేపీ సర్కారును బంగాళాఖాతంలో కలిపేస్తా. కాంగ్రెస్, బీజేపీలకు దేశాన్ని పరిపాలించే అర్హత లేదు. బీజేపీ వచ్చిన 8 ఏళ్లలో ఏం పీకింది లేదు. మీ లెక్కలన్నీ కూడా తప్పులే. మీ దౌర్భాగ్యపు పాలన, ముండ పాలన ఈ దేశ ప్రజలకు అక్కర్లేదు. రాళ్లేసిన డబ్బాను ఊపినట్టు, కుక్కల్లాగా మొరగడం తప్ప మీకు పరిపాలించడం చేత కాదు. ఆ పరిపాలన ఎలా ఉంటదో నేను చూపిస్తా. తెలంగాణ సాధించిన అనుభవంతో చెప్తున్నా. తెలంగాణ కోసం నేను ఏ నాయకుణ్నీ కలవలేదు. ప్రజల్నే కలుపుకొని పోయిన. ఇప్పుడు కూడా ప్రజల్నే కలుపుకొని పోతా. మిమ్మల్ని కట్ట కట్టి బంగాళాఖాతంలో పారేసుడు ఖాయం.
2) మన రాజ్యాంగాన్ని ఇప్పటికి 88 సార్లు సవరించుకున్నం. ఇంకా సవరించుకుంట కూసుండుడు గాదు. కొత్త రాజ్యాంగమే రాసుకుందాం. చాలా దేశాలు కొత్త రాజ్యాంగాలు రాసుకున్నయి. మనం మాత్రం ఎందుకు రాసుకోవద్దు.
3) (ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు) నేం జెప్పిన విషయం మీకు అర్థం గాలే. మన దేశంలో అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఏఐఎస్ లతో మాట్లాడిన. ఈ దేశాన్ని ఎట్ల బాగు చేయొచ్చే చాలా విషయాలు డిస్కస్ చేసిన. చాలా మంది ఉన్నరు. వాళ్లంతా అనుభవ జ్ఞానాన్ని నాకు పంచిండ్రు. ఈ దేశ ముఖచిత్రం మార్చుటానికి నేనే ముందుకొస్త. ఏం ఎందుకు ముందుకు రావద్దు. నేను ఈ దేశ పౌరుణ్ని కాదా. ఆల్రెడీ నేను సక్సెస్ ఫుల్ సీఎం. నా కాన్సెప్టు బాగుంటే దేశప్రజలందరు గూడ నాతోని నడుస్తరు. ఎవరు లీడ్ జేస్తరో వాడే లీడర్. నేనెందుకు లీడర్ కావద్దు.. ఈ ఫిబ్రవరిలనే హైదరాబాద్ ల ఓ మీటింగ్ పెడ్తున్న. పెద్ద లెవల్ల డిస్కస్ చేస్తం. దేశ స్వరూపమంతా హైదరాబాద్ నుంచే మారబోతుంది. దాన్ని కవర్ జేసే అదృష్టవంతులు కూడా ఇక్కడి విలేకర్లే.
4) బీజేపీని సాగనంపుటానికి చాలా మందితోని మాట్లాడ్తున్న. నిన్న గాక మొన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తోని మాట్లాడిన. చాలా విషయాలు డిస్కస్ జేస్కున్నం. ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులతోని మాట్లాడిన. బీజేపీ ఇగ దేశంల లేకుండ జేసుడే మా ఎజెండా. కలిసివచ్చే వాళ్లతోనే కలిసి కొట్లాడ్తం.
5) తెలంగాణ పథకాలు జూసిన ఇతర రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు గూడ వాళ్లను తెలంగాణలో కలుపుమని కోరుతున్నయి. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు గ్రామాల ప్రజలు గూడ అడుగుతున్నరు. మా గుండె రగుల్తంది. రాష్ట్ర విభజన టైంల మా 7 మండలాలను ఆంధ్రాల కలిపిండు మోడీ. పవర్ ప్లాంట్ ను కూడ కోల్పోయినం. మాకెంత బాదుంటది. (అంటే కోల్పోయిన మండలాలకు వ్యతిరేకంగా బీజేపీ మీద ప్రజల్ని ఉసిగొల్పుతున్నారన్నమాట).
ఇలా తన సుదీర్ఘమైన రెండున్నర గంటల "సినిమా" లో పూనకం వచ్చినట్టుగా ఊగిపోయిన సీఎం అసలు విషయాలు కాస్తా బహిర్గతం చేశారు. ఇక్కడే ఆయన అంచనా వేసుకున్నది ఒకటైతే జరిగింది వేరొకటి అన్నట్టుగా తయారైంది. హుజూరాబాద్ ఎన్నిక తరువాత తెలంగాణలో తనకున్న ఇమేజ్ ఏంటో అర్థమైన కేసీఆర్... విరుగుడుగా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నారు. దిద్దుబాటు చర్యల కోసం ఏం చేస్తే బాగుంటుందో మథనపడుతున్నారు. తాను చేయించిన సర్వేల్లో వచ్చిన రిపోర్టుతో దిద్దుబాటుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపారు. తొలుతగా మోడీకి అధికారం అందించిన పీకే అయితేనే మళ్లీ మోడీని సాగనంపడానికీ పనికొస్తాడని భావిస్తున్నారు. అందుకే ఆయన్ని సలహాదారుగా నియమించుకున్నారు. ఇకపై ఆయన స్థానిక నేతల సలహాలు, సూచనలు తీసుకోవడం లేదన్నమాట. ఢిల్లీని కొట్టాలంటే ఢిల్లీ లెవల్ స్ట్రాటజిస్టులే కావాలని భావిస్తున్నారు కేసీఆర్.
అంటే కేసీఆర్ ఏదైతే లీక్ చేశారో... అదే అంశాలపై రేపు పీకే అండ్ టీం, ఇతర ముఖ్యమంత్రులతో కలిసి పని చేస్తుందన్నమాట. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీని బొంద పెట్టడానికంటూ కేసీఆర్ ఎంత భారీ స్కెచ్ వేశారో తెలుగు ప్రజల కళ్లకు కట్టారు కేసీఆర్. వాస్తవానికి రాజ్యాంగం మార్చాలనేది బీజేపీ నేతల సీక్రెట్ ఎజెండా. వారెక్కడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఆఫ్టరాల్ రిజర్వేషన్ల అంశం తెరమీదికి వచ్చినప్పుడే తామెక్కడా రిజర్వేషన్ల జోలికి పోబోమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేత చెప్పించారు. అలాంటిది ఏ సైద్ధాంతిక భూమిక లేని కేసీఆర్ ఏ బేస్ మీద రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బీజేపీ నేతలే కేసీఆర్ చేత మాట్లాడిస్తున్నారని బీజేపీ వ్యతిరేక పార్టీలు విమర్శించినా... అగ్రవర్ణ ప్రజల సంతుష్టి కోసం బీజేపీ కన్నా కేసీఆరే ఎక్కువ ఆలోచిస్తారన్న పేరు ఇదివరకే ఉంది. కాబట్టి బీజేపీని ఎదుర్కోవాలంటే అదే ఎజెండాను వారికంటే ముందే అనౌన్స్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు క్లియర్ కట్ గా అర్థమైపోతుందంటున్నారు విశ్లేషకులు.
రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెట్టి లోగుట్టు బయటపెట్టుకున్న కేసీఆర్ కు అసలైన పరిపక్వత ఇంకా అబ్బలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. అదే మోడీ-అమిత్ షా అయితే గనక ఏ విషయాలనూ బయట పెట్టకుండా తాము చేయాల్సింది మాత్రం చేసుకుపోతారని, పలు జాతీయ-అంతర్జాతీయ అంశాల విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయాల్లో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని, అలాంటి చర్యల ప్రభావం ప్రజల మీద బాగా పడుతుందంటున్నారు నిపుణులు. నాయకుడన్నవాడు గుంభనంగా ఉండాలే తప్ప గుట్టు బయట పెట్టుకునేవాడు కాకూడదంటున్నారు. అలాగే యువతను బీజేపీకి వ్యతిరేకంగా ఉసిగొల్పడం వెనుక కేసీఆర్ వేసుకున్న భారీ స్కెచ్ కూడా లీకైపోయింది. బీజేపీ సీట్ల పెరుగుదల కోసం ఏవిధంగా ఓట్ల పోలరైజేషన్ ను వాడుకుంటున్నదో అదే స్ట్రాటజీని కేసీఆర్ కూడా అవలంబించబోతున్నట్టు చెప్పకనే చెప్పినట్లయింది. బీజేపీ నేతలది మతపిచ్చి అంటున్న కేసీఆర్... నిర్లజ్జగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీని మరోసారి ఆకాశానికెత్తేశారు. ఆయన తెలంగాణ బిడ్డ అని.. దేశవ్యాప్తంగా తెలంగాణ పేరు ఆయన వల్ల వినబడుతుందని, ముస్లింల నాయకుడిగా ఎదగాలనుకోవడం తప్పెలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు. అంటే రానున్న రోజుల్లో తెలంగాణలోనే కాక యావద్దేశంలో కేసీఆర్ కూడా ఓట్ల పోలరైజేషన్ ఎత్తుగడను అవలంబించబోతున్నట్టు తనకు తానే లీక్ చేసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరి బహిర్గతమైన కేసీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందీ.. బీజేపీ నేతల కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలంటున్నా రు నిపుణులు.