సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కేవియెట్.. కేటీఆర్ కు ఇక చుక్కలే!
posted on Jan 7, 2025 1:50PM
ఒక వైపు ఏసీబీ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు తెలంగాణ సర్కార్ ఇలా కేటీఆర్ పై ముప్పేట దాడి చేస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కనీసం అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తినీ తిరస్కరించింది. దీంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ లో భాగస్వామి అయిన గ్రీన్ కో తెలంగాణ, ఏపీలోని కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది. అదే సమయంలో కేటీఆర్, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరి నివాసాలలో సోదాలకు అనుమతి తీసుకుంది. ఇక నేడే రేపొ ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేయాడానికి పకడ్బందీగా అడుగులు వేస్తున్నది.
ఈ నేపథ్యంలో తన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. సుప్రీంను ఆశ్రయించే ఉద్దేశంతో ఆయన ఇప్పటికే తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నారు. అలాగే పార్టీలోని ప్రముఖలతో కూడా ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. మొత్తంగా నేడో, రేపో కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచన చేస్తుండగానే రేవంత్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసి ఒక వేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు కూడా వినాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేవీయెట్ దాఖలు చేసింది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతిలో కేటీఆర్ ప్రమేయం ఉందనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొంది. అలాగే ఈ కేసులో భాగస్వామి అయిన గ్రీన్ కో.. బీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారానికి సంబంధించిన ఆధారాలూ ఉన్నాయని పేర్కొంటూ.. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే ఆయన పిటిషన్ తో పాటు తమ పిటిషన్ ను కూడా విచారించాలనీ, తమ వాదననూ వినాలని కోరుతూ తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేసింది.